భారం దించుకున్న కొరటాల

తక్కువ సినిమాలతో టాప్ ప్లేస్ లో స్థానం సంపాదించుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ నుండి మొదలైన కొరటాల ప్రయాణం ‘ఆచార్య’ వరకూ వచ్చింది. ఈ మధ్యలో కొరటాల చేసింది మూడంటే మూడు సినిమాలే. చాలా ఇంపార్టెంట్ పీరియడ్ లో ఓ నాలుగేళ్ళు ‘ఆచార్య’ కోసం కేటాయించి భారంతో కూడిన భాద్యతను మోశాడు కొరటాల.

మెగా స్టార్. మెగా పవర్ స్టార్ ఇద్దరినీ పెట్టుకొని సినిమా తీయడం అంటే మాటలా? పదే పదే డిస్కషన్స్, మధ్యలో మేకింగ్ మీటింగ్స్ , మ్యూజిక్ సిట్టింగ్స్ , స్క్రిప్ట్ లో చేంజెస్ ఒకటా రెండా ఈ సినిమాకి ఎన్నో బరువైన భాద్యతలు భుజాలపై పెట్టుకున్నాడు కొరటాల. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే చరణ్ ని సినిమాలోకి తీసుకొచ్చేందుకు చాలానే టైం పట్టింది. ఆ గ్యాప్ లో షూటింగ్ వాయిదా వేసుకున్నారు.

ఫైనల్ గా చరణ్ ఎంట్రీ ఇచ్చాక కోవిడ్ ఎఫెక్ట్ , వెంటనే లాక్ డౌన్, రిలీజ్ పోస్ట్ పోన్ ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొరటాలని బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే ఈ నాలుగేళ్ళు తనకి ఓ గొప్ప పాఠం చెప్పాయని, ఆచార్య ద్వారా ఎన్నో నేర్చుకున్నానని, ఓపిక పెంచుకున్నానని తన సన్నిహితులతో కొరటాల చెప్పుకున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఓ కమర్షియల్ డైరెక్టర్ ఇన్నేళ్ళు ఓ యాక్షన్ డ్రామా సినిమా కోసం కేటాయించడం చాలా రేర్ అనే చెప్పాలి.

చరణ్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా చిరుకి ఎంతో ప్రతిష్టాత్మకమైంది కాబట్టి ఈ సినిమాకు సంబంధించి కొరటాల మీదే ఎక్కువ భాద్యత పడింది. ఇక రిలీజ్ కి ముందు కూడా రీ రికార్డింగ్ విషయంలో మణిశర్మతో కొరటాల కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నారని భోగట్టా. ఫైనల్ గా ఇప్పుడు కొరటాల ఫ్రీ అయిపోయాడు. నాలుగేళ్ల భారం తలమీద నుంచి దించుకున్నాడు. ఇక రిజల్ట్ కూడా అనుకున్నట్టు వచ్చేస్తే కూల్ గా ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేస్తాడు కొరటాల. కాకపోతే కొన్ని రోజులు రిలాక్స్ అయిన తర్వాత.. అంటే జూన్ నుండి ఆ సినిమా షూట్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడు.