దర్శకుల్లో చాలామందికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అది వాళ్లను వెంటాడుతూ ఉంటుంది. ఫలానా కథతో సినిమా చేయాలి.. ఫలానా నటుడితో పని చేయాలి.. ఫలానా వ్యక్తి మీద సినిమా చేయాలి.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొరటాల శివ ఇందులో మూడో కేటగిరీకి చెందుతాడట. ఆయనకూ ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉందట. అదొక నిజ జీవిత గాథ అట.
ఆ వ్యక్తి మరెవరో కాదు.. తర తరాలుగా భారతదేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న స్పిరుచువల్ లీడర్ స్వామి వివేకానంద. ఆయన మీద ఒక సినిమా తీయాలన్నది ఎప్పట్నుంచో తనకున్న కోరిక అని వెల్లడించాడు కొరటాల. వివేకానంద తనతో పాటు ఎందరినో ఇన్‌స్పైర్ చేశాడని.. ఆయన కథను భారీ స్థాయిలో తెరపై చూపించాలన్నది తన అభిమతమని కొరటాల చెప్పాడు.
హాలీవుడ్ వాళ్లు గాంధీ కథను పెద్ద కాన్వాస్‌లో ప్రపంచ స్థాయిలో తీసినట్లుగా.. వివేకానంద కథను కూడా అదే స్థాయిలో చూపించాలని తాను కోరుకుంటున్నట్లు కొరటాల చెప్పాడు. సందేశాన్ని అందంగా కమర్షియల్ కథల్లో మిళితం చేసి ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించగల నైపుణ్యం కొరటాల సొంతం. తొలి సినిమా నుంచి అదే చేస్తూ వస్తున్నాడు. ఐతే ఎంత సందేశం ఇచ్చినా, ఎన్ని మంచి విషయాలు చెప్పినా కమర్షియల్ హంగులకు ఆయన సినిమాల్లో లోటు ఉండదు.
మరి వివేకానంద కథను కమర్షియల్‌గా ఎలా వర్కవుట్ చేస్తాడన్నది ఆసక్తికరం. ఈ సంగతి పక్కన పెడితే.. తాను భవిష్యత్తులో ఎవరెవరితో సినిమాలు చేసే అవకాశాలున్నాయో కొరటాల వెల్లడించాడు. ప్రభాస్‌తో ‘మిర్చి’ తర్వాత తన రెండో సినిమా కచ్చితంగా ఉంటుందన్నాడు. రామ్ చరణ్‌తో మరో సినిమా ఎప్పుడైనా చేయొచ్చన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం ఒక కథను ఎప్పుడో సిద్ధం చేసి పెట్టినట్లు కొరటాల వెల్లడించాడు. అల్లు అర్జున్‌తో అనుకున్న సినిమాకు తొందరేం లేదని.. అది కూడా కాస్త ముందు వెనుకగా ఎప్పుడో ఒకప్పుడు ఉంటుందని కొరటాల స్పష్టం చేశాడు.