దశాబ్ద విరామానికి తెరదించుతూ 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాలో రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు సైరా లాంటి భారీ చిత్రంతో ఆయన ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ తర్వాత అనుకోని విధంగా కెరీర్లో చాలా గ్యాప్ వచ్చేసింది. కరోనా, ఇతర కారణాలతో ఆయన కొత్త చిత్రం ఆచార్య చాలా ఆలస్యం అయి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐతే ఈ సినిమాకు రిలీజ్ టైమింగ్ అంత సానుకూలంగా అయితే కనిపించడం లేదు.
ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాక.. ఈ చిత్రం రిలీజవుతోంది. మూడు వారాల వ్యవధిలో వచ్చిన ఈ రెండు విజువల్ వండర్స్ కోసం ప్రేక్షకులు బాగా ఖర్చు పెట్టుకున్నారు. అవి ఆడియన్స్‌ను వేరే ప్రపంచాల్లోకి తీసుకెళ్లాయి. విజువల్‌గా వారికి గొప్ప అనుభూతిని పంచాయి. దీంతో ఆచార్య కోసం ప్రేక్షకులు మరీ ఎగబడిపోవట్లేదు.
ఆచార్యకు ఉన్నంతలో బుకింగ్స్ బాగానే అనిపిస్తున్నాయి కానీ.. సూపర్ అని మాత్రం చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే ఇంకా జోష్ ఉండాలి. ఆచార్య జోరు కాస్త తగ్గడానికి పై రెండు చిత్రాల ప్రభావం ఓ కారణం. ఐతే సినిమా చాలా ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం బాగా పడి ఆచార్య ఓవరాల్ బడ్జెట్ పెరిగింది. అందుకు తగ్గట్లే భారీ రేట్లకు సినిమాను అమ్మారు. ఇప్పుడు సినిమామీద మోయలేనంత భారం ఉంది. అది రికవర్ కావాలంటే సినిమాకు లాంగ్ రన్ అవసరం.
ఏదో వీకెండ్ వరకు దూకుడు చూపించి తర్వాత డ్రాప్ అయితే కష్టం. కాబట్టి సినిమాకు చాలా మంచి టాక్ రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే సినిమా రెండు వారాల పాటు నిలబడుతుంది. కరోనా తర్వాత ప్రేక్షకులు అంత ఈజీగా థియేటర్లకు రావట్లేదు. యావరేజ్ టాక్ వస్తే ఫ్యామిలీస్ థియేటర్లకు కదలట్లేదు. రిపీట్ ఆడియన్స్ కూడా తగ్గిపోతున్నారు. కాబట్టి ఆచార్యకు అదిరిపోయే టాక్ రావాలి. కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాలనిపించేలా ఈ సినిమా ఉండాలి. మరి ఆచార్య అలా ప్రేక్షకులను ఆకర్షిస్తుందో లేదో చూడాలి.