బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తాలూకు మంటలు ఇంకా చల్లారలేదు. వారం తర్వాత కూడా అతడి అభిమానులు, మద్దతుదారులు శాంతించడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో అతడికి మద్దతుగా అనేక హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. సుశాంత్ తనకు తానుగా ఆత్మహత్యకు పాల్పడలేదని.. ఇది పరోక్షంగా హత్య లాంటిదే అని అతడి అభిమానులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ మూవీ మాఫియా అతణ్ని టార్గెట్ చేసి చంపేసిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్లతో పాటు బాలీవుడ్ బడాబాబులను, వారసత్వం ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వాళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్.
సుశాంత్ నెపోటిజం మీద పోరాడిన ధీరుడని అంటున్న అతడి మద్దతుదారులు.. అతను చనిపోయిన జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటించడం విశేషం. సుశాంత్ బాలీవుడ్లో చాలామందిలా వారసత్వంతో హీరో కాలేదని.. సొంత ప్రతిభతో ఎంతో కష్టపడి ఎదిగాడని.. స్టార్ ఇమేజ్ సంపాదించాడని.. అతను నెపోటిజం మీద విజయం సాధించాడని.. కానీ చివరికి ఈ స్టార్ కిడ్స్, వాళ్లను ప్రమోట్ చేసే వాళ్ల వల్లే ప్రాణాలు కోల్పోయాడని.. అందుకే జూన్ 14వ తేదీని వరల్డ్ యాంటీ నెపోటిజం డేగా ప్రకటిస్తున్నామని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మంచి స్పందనే వస్తోంది. మద్దతుగా పెద్ద ఎత్తున ట్వీట్లు పడుతున్నాయి. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యను నీరుగార్చేందుకు పోలీసులు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి కుమ్మక్కవుతున్నారంటూ సుశాంత్ ఫ్యాన్స్ ఆరోపిస్తూ ట్వీట్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates