ఆర్యన్ రాజేష్ హీరో.. నిహారిక నిర్మాత

ఈవీవీ సత్యనారాయణ తన ఇద్దరు కొడుకుల్లో పెద్ద వాడైన ఆర్యన్ రాజేష్‌ను హీరోగా నిలబెట్టాలని, చిన్న వాడైన నరేష్‌ను దర్శకుడిగా చూడాలని ఆశపడ్డారు. ఆ దిశగానే ‘హాయ్’ సినిమాతో ఆర్యన్‌ను హీరోగా గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. ఆ తర్వాత కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేశాడు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈలోపు తండ్రి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసి అనుకోకుండా ‘అల్లరి’ సినిమాతో హీరోగా మారిన నరేష్.. ఆ సినిమా సక్సెస్ అవడంతో కామెడీ హీరోగా సెటిలైపోయాడు.

ఒక దశలో మంచి డిమాండ్ సంపాదించాడు. తర్వాత తడబడ్డప్పటికీ.. ఇప్పుడతడి కెరీర్ పర్వాలేదు. ఆర్యన్ అయితే పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే కనిపించాడు. ఆ మధ్య ‘వినయ విధేయ రామ’లో చరణ్ సోదరుడి పాత్రలో కనిపించిన ఆర్యన్.. తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించింది లేదు. ఐతే ఇప్పుడు ఆర్యన్ హీరోగా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుండటం విశేషం.

‘హలో వరల్డ్’ పేరుతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నది మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక కావడం గమనార్హం. పింక్ ఎలిఫాంట్ పిక్చర్స్ బేనర్ మీద ఈ వెబ్ సిరీస్‌ను నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో ‘జయం’ ఫేమ్, సీనియర్ హీరోయిన్ సదా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. నిత్యాశెట్టి, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శివసాయి వర్ధన్ అనే కొత్త దర్శకుడు ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. ఈ మధ్య పబ్ గొడవతో నిహారిక పేరు అనవసరంగా వార్తల్లో నానింది. ఈ అన్ వాంటెడ్ పాపులారిటీతో నిహారిక బాగా ఇబ్బంది పడింది. అంతకంటే ముందు చైతన్యతో నిహారికకు అభిప్రాయ విబేదాలంటూ ఓ ప్రచారం నడిచింది. ఐతే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం, నిహారిక కూడా హుషారుగా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.