కీర్తి సురేష్.. 24 హత్యలు

కీర్తి సురేష్ మామూలుగా చూస్తే కొంచెం సుకుమారంగా కనిపించే అమ్మాయి. తనకు సాఫ్ట్ క్యారెక్టర్లే సెట్ అవుతాయనిపిస్తుంది. కెరీర్లో ఎక్కువగా అలాంటి పాత్రలే చేసింది కూడా. స్టార్ హీరోల సరసన భారీ కమర్షియల్ చిత్రాల్లో నటించే అలాంటి కథానాయికను కిరాతకంగా హత్యలు చేసే గ్రామీణ అమ్మాయిగా డీగ్లామరస్ రోల్‌లో చూడటం అంటే అంత కంటే పెద్ద షాక్ లేదు.

కీర్తి ‘మహానటి’ సహా కొన్ని చిత్రాల్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసినప్పటికీ.. ఇలాంటి పాత్రలో ఆమెను ఊహించుకోలేం. ఐతే తమిళంలో అరుణ్ మాథేశ్వరన్ అనే యువ దర్శకుడు కీర్తిని ఇలాగే చూపిస్తున్నాడు ‘సాని కాయిదం’ అనే సినిమాలో. ఈ చిత్రం ‘చిన్ని’ పేరుతో తెలుగులోకి అనువాదం కూడా అయింది. దర్శకుడు సెల్వ రాఘవన్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 6న నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు.

‘సాని కాయిదం’ ఫస్ట్ లుక్ చూసినపుడే ఇదొక వయొలెంట్ మూవీ అని, కీర్తి-సెల్వ హంతకుల పాత్రల్లో కనిపించనున్నారని అర్థమైంది. ‘దండుపాళ్యం’ సినిమాను గుర్తుకు తెచ్చే భయంకరమైన లుక్స్‌లో కనిపించారు ఆ ఇద్దరూ. ఇప్పుడు ట్రైలర్లో వాళ్లిద్దరూ చేసిన వయొలెన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఒకటి రెండు కాదు.. ఇద్దరూ కలిసి 24 హత్యలు చేస్తారట ఈ సినిమాలో. ఆ హత్యలు చేసే వైనాన్ని కూడా గగుర్పొడిచే విధంగా చూపించారు. తెర మొత్తం రక్తంతో తడిసిపోయేలా కనిపిస్తోంది. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇద్దరి పేర్లు అడిగి, వారు చేసిన హత్యల గురించి విచారించే సన్నివేశాలు చూపిస్తూ.. సమాంతరంగా వాళ్లిద్దరి వయొలెన్స్ చూపించారు.

ఒక సన్నివేశంలో కీర్తి కార్లో కత్తితో ఓ వ్యక్తిని కసకసా పొడిచే సీన్ చూసి వామ్మో అనకుండా ఉండలేం. సెల్వ చెప్పిన హత్యల సంఖ్య 24 అయితే.. కీర్తి 25 అనడం చూసి ఇదేంటి లెక్క తేడాగా ఉందని పోలీస్ అడిగితే.. నాకున్న కోపానికి నిన్ను కూడా చంపాలనుంది, అందుకే 25 అని చెప్పా అని కీర్తి బదులిచ్చే షాట్ ట్రైలర్లో హైలైట్. టీజర్లో ఇదొక రివెంజ్ డ్రామా అని సంకేతాలు ఇచ్చిన దర్శకుడు.. ట్రైలర్లో ఆ రివెంజ్ క్రమాన్ని చూపించాడు. ఇంతకీ వీళ్లిద్దరూ ఇంత వయొలెంట్‌గా ఎందుకు తయారయ్యారు, ఎందుకు అన్ని హత్యలు చేశారు అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.