ఆచార్య టీం.. లైన్లో పడింది

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో.. ఇప్పటిదాకా తీసిన నాలుగు చిత్రాలతోనూ బ్లాక్‌బస్టర్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఐతే ఈ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ స్థాయిలో రిలీజ్ ముంగిట ఈ సినిమాకు హైప్ రాలేదని, అందుక్కారణం చాన్నాళ్ల పాటు సినిమా వార్తల్లో లేకపోవడమే అని, ప్రమోషన్ల పరంగా చిత్ర బృందం బాగా వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

స్వయంగా మెగా అభిమానులే ఈ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే ఇది మూడు రోజుల ముందు వరకు ఉన్న మాట. రిలీజ్ వారంలోకి అడుగుపెట్టాక ‘ఆచార్య’ టీం రూట్ మార్చింది. ప్రమోషన్లతో ఒక్కసారిగా హోరెత్తించేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలతో హడావుడి మొదలు కాగా.. ఆ తర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌తో జోష్ మరో స్థాయికి చేరింది.

అది ముగియగానే టీంలో ముఖ్యులు ఒక్కొక్కరుగా మీడియా ఇంటర్వ్యూలతో హోరెత్తించేస్తున్నారు. ఓవైపు కొరటాల టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్ల ఇంటర్వ్యూలతో సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. మరోవైపు రామ్ చరణ్ మీడియాను కలిశాడు. తర్వాత హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఇంకోవైపేమో చిరుతో స్పెషల్ ఇంటర్వ్యూలు రెడీ అవుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ‘ఆచార్య’ సినిమా మెజారిటీ షూటింగ్ జరిగిన ధర్మస్థలిలోనే చిరు అండ్ కోతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అలాగే కొందరు టాలీవుడ్ యువ దర్శకులతో చిరు స్పెషల్‌గా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

చిరు వీరాభిమానులై ఉండి, ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ దర్శకులంతా ఆయన్ని ఇంటర్వ్యూ చేసే స్పెషల్ ప్రోగ్రాం ఇది. ఇలా మొత్తానికి టీంలోని కీలక సభ్యులంతా ఒకేసారి రంగంలోకి దిగి రిలీజ్ ముంగిట ‘ఆచార్య’కు హైప్ పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ కూడా గట్టిగానే జరుగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ టైంకి హైప్ మరో స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు.