టికెట్ ధరలు, సినిమా పరిశ్రమలోని ఇతర సమస్యల పరిష్కారానికి చిరంజీవితోపాటు పలువురు సినీ ప్రముఖులు ఫిబ్రవరిలో ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే! ఆ సమయంలో చిరంజీవి చేతులు జోడించి జగన్‌తో మాట్లాడటంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. చిరం జీవి స్థాయి ఏంటి? చేతులు జోడించి పరిష్కారం అడగడం ఏంటి అని సోషల్ మీడియా వేదికగా అభిమా నులు, సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఇవన్నీ చిరంజీవికి తెలిసినా. అప్పట్లోను తర్వాత కూడా ఆయన వాటిపై ఏమాత్రం స్పందించలేదు.
అంతేకాదు..అప్పటి నుంచి మీడియాను ఆయన ఎవాయిడ్ కూడా చేస్తూ వచ్చారు. కానీ, తాజాగా చిరు ఈ పొలిటికల్ ఇష్యూపై ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు. ‘‘నన్ను విమర్శించినా, తిట్టినా పట్టించుకోను. మొదటి నుంచి ఇదే పాలసీ నాది. ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే నేను చేతులు జోడించి వేడుకున్నది ఓ ముఖ్యమంత్రిని. ఆ కుర్చీకి ఉన్న గౌరవం అది. గతంలో జరిగిన ఓ సంగతి చెబుతాను. నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నా కన్నా వయసులో పెద్దవారు నా అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి వేచి చూసేవారు. అది నా గొప్పతనం కాదు. నా కుర్చీకి వారు ఇచ్చిన గౌరవం“ అని చిరు వ్యాఖ్యానించారు.
ఇక, తాను సీఎం జగన్ విషయంలో చేసింది కరెక్టేనన్నారు. “ఇది పరిశ్రమ సమస్య… ఒక దారికి తీసుకురావాలి అనే సంకల్పంతో నేను అలా(దణ్నం పెట్టడం) చేశాను. ఆ రోజున సమస్యకు పరిష్కారం తీసుకురాకపోతే ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఈ అంకెలు కనిపించేవా? ఇండస్ట్రీ ఇంతలా కళకళలాడేదా? బాధ్యతగా ఆలోచించాను కాబట్టే ముఖ్యమంత్రిని కలిశా. ఆ సమయంలో కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలంతా అగమ్యగోచరంగా ఉండిపోయారు“ అని అన్నారు.
ఈ సమయంలో పరిశ్రమ మనుగడకి సంబంధించిన సమస్య అని గుర్తించినట్టు చెప్పారు. అందుకే చేతులు జోడించి వివరించానన్నారు. “నేను చేతులు జోడించి.. అన్న మాటపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో కూడా నాకు తెలుసు. నా ఒక్కడి కోసమే అలా చేస్తే ఆ రోజు నేను తల వంచి సిగ్గుపడతా. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందితో ముడిపడిన సమస్య ఇది. దాని పరిష్కారానికి దేవుడు నాకు ఇచ్చిన ఓ అవకాశంగా భావించా’’ అని చిరంజీవి కుండబద్దలు కొట్టారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates