అఫీషియల్.. ‘ఆచార్య’లో కాజల్ లేదు

‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్ గురించి ఎవ్వరూ మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కాజల్ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఆమె ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం లేదని తెలుసు కానీ.. ఆమె గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం ఏంటి అనే సందేహాలు కలిగాయి. ఈ సినిమాలో కాజల్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఈ ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.

ఇప్పుడు ఆ అనుమానమే నిజమని తేలింది. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఉండదని తేల్చేశాడు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాక తన పాత్రకు న్యాయం చేయలేమని భావించిన దాన్ని సినిమా నుంచి తీసేసినట్లు, ఇదంతా సుహృద్భావ వాతావరణంలోనే జరిగినట్లు కొరటాల వెల్లడించాడు.

దీని గురించి కొరటాల వివరిస్తూ.. ‘‘ఆచార్య సినిమాలో చిరంజీవి పాత్రకు మామూలుగా చూస్తే లవ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఉండకూడదు. కానీ కమర్షియల్ ఫార్మాట్లో అలాంటి పెద్ద హీరోకు హీరోయిన్ లేకుంటే బాగుండదని పెట్టాం. ధర్మస్థలిలో సరదాగా ఉండే ఒక ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేసి దానికి కాజల్‌ అగర్వాల్‌ను తీసుకున్నాం. తొలి షెడ్యూల్లో 3-4 రోజులు ఆమె మీద చిత్రీకరణ కూడా జరిపాం. కానీ ఆ పాత్రను పేపర్ మీద రాస్తున్నపుడే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేం షూట్ చేసిన రషెస్ చూసుకున్న తర్వాత ఆ సందేహాలు మరింత పెరిగాయి.

అంత పెద్ద హీరోయిన్ని ఏదో క్యారెక్టర్ కోసం అంటే క్యారెక్టర్ అన్నట్లు పెట్టలేం. ఆచార్యకు లవ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించడం కరెక్ట్‌గా అనిపించలేదు. హీరోయిన్ పాటలు పెట్టడం, తన పాత్రను ముగించడంలో ఇబ్బంది అనిపించింది. ఇదే మాట చిరంజీవి గారితో చెబితే.. మీరు ఏది నమ్మితే అది చేయండి అన్నారు. కాజల్‌కు కూడా విషయం చెప్పమన్నారు. తనకు ఇదే విషయం చెబితే.. అందంగా ఒక నవ్వు నవ్వి, ఐయామ్ మిస్సింగ్ దిస్ ఫిలిం, మళ్లీ వీలున్నపుడు కలిసి పని చేద్దాం అన్నారు’’ అంటూ అసలు విషయం చెప్పారు కొరటాల.