ప్రభాస్ తాజా చిత్రం అప్డేట్ వచ్చేస్తుంది అంటూ కొద్ది రోజులుగా సందడి జరుగుతోంది. మొత్తానికి తమ మొర ఆలకించారని ఫాన్స్ సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ అనధికారికంగా ఖరారైపోయింది. ఇక పోస్టర్ రావడమే తరువాయి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రానికి పోస్టర్ రిలీజ్ కంటే మించిన తలపోట్లు నిర్మాతల ముందు ఉన్నాయి.
విదేశాల్లో షూటింగ్ చేయక తప్పని కథ కావడంతో సెట్స్ వేసి మేనేజ్ చేయాలని అనుకున్నారు. అయితే అది కొద్ది మేర మాత్రమే సాధ్యమవుతుంది. సో, తప్పనిసరిగా విదేశాలకు వెళ్లి తీరాల్సిందేనట. ఇకపోతే తెలంగాణాలో కరోనా కోరలు చాస్తున్న వేళ షూటింగ్ మొదలు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
హోమ్ బ్యానర్ కనుక ప్రభాస్ అందుబాటులో ఉన్నా కానీ మిగతా వాళ్ళను తీసుకురావడం కుదరడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం కోసం కొన్ని ఫ్లోర్స్ బుక్ చేసి సెట్ వర్క్ మొదలు పెట్టారు. షూటింగ్ విషయంలో క్లారిటీ లేక తలపట్టుకున్నారు. ఈ సమయంలో ఫాన్స్ ఆనందం కోసం పోస్టర్లు విడుదల చేసే మూడ్ ఎవరికీ లేదు. కనుక ఈ సినిమా విశేషాల కోసం మరిన్ని రోజుల నిరీక్షణ తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates