కేజీఎఫ్-2.. కేజీఎఫ్ 2.. కేజీఎఫ్ 2.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. నార్త్, సౌత్ అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఈ చిత్రం నాలుగు రోజులుగా వసూళ్ల మోత మోగిస్తోంది. విడుదలకు ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అర్థమైపోయింది.
కానీ రిలీజ్ తర్వాత కలెక్షన్లు అంచనాలను మించి పోయాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లకు బాలీవుడ్ జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉత్తరాదిన బాహుబలి-2 రికార్డులను సైతం ఈ చిత్రం బద్దలు కొట్టేయడం విశేషం.
కేజీఎఫ్-2 ఫస్ట్ వీకెండ్ వసూళ్లు రూ.190 కోట్లను దాటిపోయినట్లు చెబుతుండటం గమనార్హం. దీనికి పోటీగా రిలీజ్ చేయాలనుకున్న జెర్సీ మూవీని వాయిదా వేయడం మంచి పనైయిందని ఇప్పుడు ఆ చిత్ర బృందం అనుకుంటూ ఉంటుందనడంలో సందేహం లేదు.
పరిస్థితి చూస్తుంటే జెర్సీ మూవీని ఈ నెల 22న అయినా రిలీజ్ చేస్తారా లేదా అన్నది సందేహంగానే ఉంది. సోమవారం పరిస్థితి చూశాక రిలీజ్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. కాగా సౌత్ ఇండియాలో అయితే కేజీఎఫ్-2కు తర్వాతి వారం కూడా ఎదురే లేకపోవచ్చు.
తెలుగులో వచ్చే శుక్రవారానికి ముందేమో మూడు చిత్రాలను ఖరారు చేశారు. వాటిలో జయమ్మ పంచాయితీ, అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రాలను ఇప్పటికే రెండు వారాలు వాయిదా వేసేశారు. నాగశౌర్య చిత్రం కృష్ణ వ్రింద విహారి వాయిదా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. అది కూడా వెనక్కి వెళ్లడం లాంఛనమే అని భావిస్తున్నారు.
మరో వైపు తమిళంలో బీస్ట్ మూవీ వీకెండ్లోనే నిలబడలేకపోయింది. సోమవారం నుంచి చాలా వరకు బీస్ట్ థియేటర్లను కేజీఎఫ్-2తో రీప్లేస్ చేస్తున్నారు. ఇక కర్ణాటకలో, కేరళలోనూ కేజీఎఫ్-2కు ఎదురే లేదు. దీంతో ఇంకో పది రోజుల పాటు ఈ సినిమా వసూళ్లు దంచుకోబోతోంది.