అవును.. కృష్ణుడి లీలలు థియేటర్లలో లేవు

థియేటర్లు తెరిచే వరకు వేచి చూద్దామా.. లేక ఎంత వస్తే అంత వచ్చింది అని ఏదైనా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో డీల్ కుదుర్చుకుని సినిమాను ఆన్ లైన్లో రిలీజ్ చేసేద్దామా.. ఇదీ ఇప్పుడు టాలీవుడ్ ప్రొడ్యూసర్ అయోమయం.

సమీప భవిష్యత్తులో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో చిన్న సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేయడమే మంచిదన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. థియేటర్లలోకి వచ్చినా పెద్దగా రెవెన్యూ రాకపోవచ్చనుకునే, థియేటర్లు పెద్దగా దొరికే అవకాశం లేదు అనుకునే సినిమాలను ఇలాగే ధైర్యం చేసి ఓటీటీల్లో వదిలేస్తున్నారు.

ఈ విషయంలో మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ కొంచెం వెనుకంజలోనే ఉంది. ఇప్పటిదాకా ‘అమృతారామమ్’ అనే చిన్న సినిమా మాత్రమే ఓటీటీలో రిలీజైంది. సత్యదేవ్ సినిమాలు ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’, ‘47 డేస్’ ఓటీటీ రిలీజ్‌కు లైన్లో ఉన్నాయి.

ఈ వరుసలో చేరే సినిమాలేవా అని చూస్తున్నారంతా. సురేష్ ప్రొడక్షన్స్ వారి ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఇలాగే రిలీజ్ కాబోతోందని ఈ మధ్య వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయం ఖరారైంది. తాజాగా ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన శ్రద్ధ శ్రీనాథ్ తమ చిత్రం ఓటీటీలోనే రిలీజ్ కాబోతోందని సంకేతాలిచ్చింది. ‘కమింగ్ టు యువర్ డివైజెస్ సూన్’ అంటూ ఆమె ఈ సినిమా గురించి ఒక ట్వీట్ వేసింది. దీన్ని బట్టి సినిమాను టీవీలు, కంప్యూటర్లు, మొబైళ్లలో చూసుకోవచ్చన్నమాట.

‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ను ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేశఆడు. శ్రద్ధతో పాటు షాలిని వ‌డ్నిక‌ట్టి అనే అమ్మాయి ఇందులో మరో కథానాయికగా నటించింది. సిద్ధు, ర‌వికాంత్ క‌లిసి ఈ చిత్రానికి స్క్రిప్టు రాయ‌డం విశేషం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది. అంతా బాగుంటే మే 1న రిలీజవ్వాల్సిన ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.