మెగాస్టార్ చిరంజీవి తన తాజా నిర్ణయంపై తన అభిమానుల నుంచే వస్తున్న నెగెటివిటీ చూసి భయపడ్డారా? ఔననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. చిరు కొత్త చిత్రం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహించబోతున్నారని.. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా రాబోతున్నారని ప్రచారం జరగడం.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం దీని గురించి వార్తలు రావడం తెలిసిందే. ఐతే ఈ సమాచారం బయటికి రావడం ఆలస్యం.. సోషల్ మీడియాలో చిరు మీద తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా మెగా అభిమానులే ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాడుతుంటే.. ఇంకోవైపు జగన్‌ను తన సినిమా వేడుకకు చిరు ముఖ్య అతిథిగా పిలిచి ఆయనతో సన్నిహితంగా మెలిగితే.. పొగడ్తలు గుప్పిస్తే ఏమైనా బాగుంటుందా అంటూ అందరూ చిరును తప్పుబట్టారు.
రాజకీయంగా ఏపీలో వేడి రాజుకుంటున్న సమయంలో, ప్రభుత్వంపై పవన్ ఎటాక్ మరో స్థాయికి చేరుతున్న తరుణంలో ఈ కలయికి ఎంతమాత్రం మంచిది కాదని.. పవన్‌కు బాగా డ్యామేజ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. న్యూట్రల్స్ సంగతి పక్కన పెడితే మెగా అభిమానులే ఈ ఆలోచనను తప్పుబట్టడంతో చిరు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 23న హైదరాబాద్‌లోనే చేయబోతున్నారట. ఆంధ్రాలో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారట కానీ.. జగన్ ముఖ్య అతిథిగా ప్రి రిలీజ్ ఈవెంట్ మాత్రం లేదనే అంటున్నారు. ‘ఆచార్య’ టీం అయితే అసలు ముందు నుంచి ఈ ఆలోచన లేదన్నట్లుగా మాట్లాడుతోందట.
ఈ ఈవెంట్‌కు అసలు ఏర్పాట్లే జరగలేదని.. జనాల స్పందన ఎలా ఉంటుందో చూడటానికి పీలర్ వదిలారని.. రెస్పాన్స్ చూశాక వెనక్కి తగ్గారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో కానీ.. ‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో జగన్ పాల్గొనడం లేదు అన్న సమాచారం మాత్రం మెగా అభిమానులకు గొప్ప ఊరటనిస్తోంది.