తెలుగు వారికి తెలుగంటే చిన్న చూపు అనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉంది. దక్షిణాదిన చూస్తే తమిళులు, కన్నడిగులు, మలయాళీలు తమ భాషను, సంస్కృతిని ఎంత గొప్పగా చూస్తారో.. వాటిని కాపాడుకోవడానికి ఎంతగా తపిస్తారో అందరికీ తెలిసిందే. ఆ తపన మనవాళ్లలో కనిపించదు అనడానికి ఎన్నో రుజువులు కనిపిస్తుంటాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతల వరకు అందరూ మన భాష పట్ల చూపించే శ్రద్ధ అంతంతమాత్రంగానే ఉంటుంది. కాబట్టే పాఠశాలల్లో తెలుగు మీడియం పూర్తిగా తీసేస్తున్నా కూడా ఎవరూ పట్టనట్లే ఉంటారు.
జనాన్ని బట్టే సెలబ్రెటీలు, రాజకీయ నేతలు కూడా వ్యవహరిస్తారనడానికి తాజా రుజువు.. టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ ట్విట్టర్ పోస్టులు. ఈ నెల ఆరంభంలో తెలుగు వాళ్లు ఉగాది పండుగ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది అచ్చమైన తెలుగు వారి పండుగ. ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరాది.
ఈ సందర్భంగా రామ్ Happy Ugadi అంటూ ఇంగ్లిష్‌లో తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పాడు. తన సినిమాలు, సోషల్ మీడియా ప్రచారం కోసం పెద్ద పీఆర్ టీంను మెయింటైన్ చేసే రామ్‌కు తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పడం కష్టమా? వేరే పండుగల సంగతి ఎలా ఉన్నా.. ఇది అచ్చమైన తెలుగు వారి పండుగ. అలాంటపుడు తెలుగులో శుభాకాంక్షలు చెప్పలేడా? కానీ దాని మీద అతను శ్రద్ధ పెట్టలేదు. జనాలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కానీ ఈ శుక్రవారం తమిళ నూతన సంవత్సరాది. ఈ సందర్భంగా అతను తమిళంలో మెసేజ్ పోస్ట్ చేయడం గమనార్హం. తమిళంలో టైప్ చేయించుకుని మరీ పోస్ట్ చేయడం అంటే ఎంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాడో అర్థం చేసుకోవచ్చు.
తమిళులు తమ భాష మీద ఎంత ప్రేమ చూపిస్తారో అందరికీ తెలుసు. కాబట్టే ఇంగ్లిష్‌లో విష్ చేస్తే వారికి కోపం వస్తుందనుకున్నాడో, లేక తమిళంలో మెసేజ్ పెట్టి వారిని మెప్పించాలనుకున్నాడో కానీ.. రామ్ అంత శ్రద్ధ పెట్టాడు. కానీ తెలుగు వారైతే ఏం పట్టించుకోరు కాబట్టి ఉగాదికి ఇంగ్లిష్ విష్ అన్నమాట. ఇందులో కేవలం రామ్‌ను మాత్రేమే కాదు.. ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకునే తెలుగు వారిని కూడా తప్పుబట్టాల్సిందే.