రోడ్ క్లియర్.. టాక్ వస్తే ఊచకోతే

‘కేజీఎఫ్-చాప్టర్ 1’కు కొనసాగింపుగా వస్తున్న ‘కేజీఎఫ్-2’ మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. కానీ సినిమా పలుమార్లు వాయిదా పడటంతో కొంత ఆసక్తి తగ్గింది. దీనికి తోడు ప్రేక్షకుల్లో ఏ అంచనాలు లేనపుడు.. వారికి అపరిమిత వినోదాన్ని అందించి ఆశ్చర్యపరిచిన ప్రశాంత్ నీల్.. ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత ఆకాశాన్ని అంటుతున్న అంచనాలను అందుకోగలడా అన్న సందేహాలు కలిగాయి.

‘కేజీఎఫ్-2’ ట్రైలర్ విషయంలో మిశ్రమ స్పందన రావడమూ తెలిసిందే. దీంతో సినిమా ప్రేక్షకులను ఏమాత్రం సంతృప్తి పరుస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాగే భారీగా బిజినెస్ చేసుకున్న ఈ చిత్రం.. బయ్యర్లను బయటపడేస్తుందా లేదా అన్న భయాలూ కలిగాయి. కానీ రిలీజ్ వీక్‌లోకి అడుగు పెట్టేసరికి మొత్తం కథ మారిపోయింది. ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా అదిరిపోయే రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. నార్త్ ఇండియాలో అయితే ‘ఆర్ఆర్ఆర్’ను మించి క్రేజ్ సంపాదించుకుందీ చిత్రం.

ఈ దెబ్బకు హిందీలో ఈ వారం రిలీజ్ కావాల్సిన ‘జెర్సీ’ సినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ జోరు కూడా తగ్గడంతో నార్త్ ఇండియాలో ‘కేజీఎఫ్-2’కు ఎదురే లేకపోయింది. సినిమా రేంజ్ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఐతే దక్షిణాదిన ఈ చిత్రానికి ‘బీస్ట్’ పెద్ద అడ్డంకిలా కనిపించింది. సూపర్ ఫాంలో ఉన్న విజయ్, నెల్సన్ దిలీప్‌కుమార్‌ల కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో ‘బీస్ట్’పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. తమిళనాడుతో పాటు.. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం బాగానే ఉంటుందనుకున్నారు.

ఐతే బుధవారం రిలీజైన ‘బీస్ట్’ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తమిళ జనాలు, ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ ఆహా ఓహో అనేస్తున్నారు కానీ.. బయట అందరూ ఈ చిత్రాన్ని డిజాస్టర్‌గా తీర్మానించేశారు. తెలుగులో పూర్తి నెగెటివ్ టాక్ వస్తోంది. కర్ణాటక, కేరళల్లో కూడా ఇదే పరిస్థితి. తమిళనాడులో తొలి రోజు తర్వాత బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ‘బీస్ట్’ నుంచి ‘కేజీఎఫ్-2’కు ముప్పు తొలగినట్లే కనిపిస్తోంది. ‘బీస్ట్’కు నెగెటివ్ టాక్ రావడంతో దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ ప్రభంజనానికి రోడ్ క్లియర్ అయినట్లే. జస్ట్ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కావాల్సిందే. సినిమా ఓ మోస్తరు స్థాయిలో ఉన్నా వసూళ్ల ఊచకోత చూడబోతున్నట్లే.