దిల్ రాజు అత్యాశ

Dil Raju
Dil Raju

కరోనా పుణ్యమా అని ఇప్పటికే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది. కొవిడ్ టైంలో ఓటీటీల విప్లవం మొదలై.. ప్రతి ఇంట్లోనూ మూణ్నాలుగుకు తక్కువ కాకుండా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉంటున్నాయి. వాటిలో బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు అందుబాటులోకి వస్తున్నాయి. అవి చూడటానికే జనాలకు టైం ఉండట్లేదు. ఇక థియేటరుకు వెళ్లి సినిమా చూడాలంటే.. అది చాలా ప్రత్యేకంగా ఉండాలి.

థియేటర్లలోనే వెళ్లి సదరు సినిమా చూడాలన్న బలమైన ఫీలింగ్ కలిగితే తప్ప.. సగటు ప్రేక్షకుడు వెండి తెరల వైపు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ విషయం బాగా వర్తిస్తుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా అని టికెట్ల ధరలు అవసరానికి మించి పెంచుకుంటూ పోతుండటం ఇండస్ట్రీకే శాపంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణలో మరీ ఎక్కువగా రేట్లు పెంచేశారు. రాజమౌళి సినిమాకున్న బ్రాండ్ వాల్యూ, ఆయన సినిమాలు చూస్తే విజువల్ ఎక్స్‌పీరియన్స్, ఈ సినిమాలో ఉన్న స్టార్ పవర్ వల్ల తప్పక థియేటర్లకు వెళ్లి సినిమా చూశారు ప్రేక్షకులు. కానీ టికెట్ల ధరల విషయంలో మాత్రం మెజారిటీ ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఐతే డిమాండ్ ఉంది కాబట్టి దానికి నడిచిపోయింది. కానీ మిగతా చిత్రాలకు కూడా రేట్లు పెంచుకుంటామంటే ఆడియన్స్ ఊరుకుంటారా? ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం భారీగా ఖర్చు పెట్టారు. గురువారం ‘కేజీఎఫ్-2’ అనే క్రేజీ మూవీ వస్తోంది. దానికీ రేట్ల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. అంటే దానికీ జేబులకు చిల్లు పడటం గ్యారెంటీ. అలాంటపుడు ‘బీస్ట్’ అనే డబ్బింగ్ సినిమాకు రేట్లు పెంచి అమ్మితే జనాలకు మంట పుట్టదా?

కానీ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు అత్యాశకు పోయాడు. సింగిల్ స్క్రీన్లలో రూ.150గా ఉన్న రేటును రూ.175 పెంచుకునేలా అనుమతులు సంపాదించాడు. ఆ మేరకే టికెట్లు అమ్మతున్నారు. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలతో కలిపితే రేటు రూ.200 దాటుతోంది. ఇది ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. విజయ్ గత సినిమా ‘మాస్టర్’కు తెలుగులో ఒక రేంజిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ ‘బీస్ట్’కు క్రేజ్ ఉన్నప్పటికీ బుకింగ్స్ ఆశాజనకంగా లేవంటే.. టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటమే కారణం అనడంలో సందేహం లేదు.

రూ.150 రేటే ఎక్కువ అంటే దాని మీద ఇంకా పెంచుకుని దండుకోవాలని చూడటం అత్యాశ కాక మరేంటి? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనాలకు నచ్చింది కాబట్టి ఎంతైనా పెట్టి చూశారు కానీ.. ‘రాధేశ్యామ్’కు ఈ రేట్ల పెంపు ఎంత ప్రతికూలంగా మారిందో అందరూ చూశారు. ఇక సాధారణ స్థాయిలో పెరిగిన రేట్ల పుణ్యమా అని స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని లాంటి చిత్రాలైతే దారుణంగా దెబ్బతిన్నాయి. ఓటీటీల దెబ్బకు ఆల్రెడీ థియేటర్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారగా.. ఈ రేట్ల పెంపుతో మరింతగా ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం దీర్ఘ కాలంలో పెద్ద నష్టమే చేసుకునేలా ఉన్నారు టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.