గ‌ని.. మ‌రీ ఇంత ఘోర‌మా?

మెగా ఫ్యామిలీ యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ చివ‌రి సినిమా గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ 25 కోట్ల‌కు పైగానే షేర్ రాబ‌ట్టింది. అంత‌కుముందు అత‌డి కెరీర్లో ఫిదా, తొలి ప్రేమ లాంటి మంచి విజ‌యాలున్నాయి. వెంక‌టేష్‌తో క‌లిసి న‌టించిన ఎఫ్‌-2 సైతం పెద్ద హిట్టే అన్న సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఒక స్థాయిలో ఉన్న హీరోనే అత‌ను. ఇప్ప‌టిదాకా అత‌డి సినిమాల‌కు ఓపెనింగ్స్ కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అత‌డి కొత్త చిత్రం గ‌ని మీద కొత్త నిర్మాత‌లు అల్లు బాబీ, సిద్ధు ముద్ద 30 కోట్ల‌కు పైగానే బ‌డ్జెట్ పెట్టేశారు.

ఈ సినిమా తీసిన కిర‌ణ్ కొర్ర‌పాటి కొత్త ద‌ర్శ‌కుడైనా స‌రే.. నిర్మాత‌లు ధైర్యం చేశారు. సినిమా మీద అంద‌రూ చాలా న‌మ్మ‌కంగా ఉన్న‌ట్లే క‌నిపించింది. టాక్ ఎలా ఉన్నా స‌రే.. ఓపెనింగ్స్ బాగానే వ‌స్తాయ‌ని అనుకున్నారు. బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. సొంతంగా రిలీజ్ చేసిన ఏరియాల‌తో క‌లిపితే మొత్తంగా థియేట్రిక‌ల్ హ‌క్కుల వాల్యూ రూ.27 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం.

ఐతే ఇప్పుడు ఈ మొత్తంలో ప‌దో వంతుకు మించి గ‌ని షేర్ వ‌సూలు చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డం విస్మ‌యానికి గురి చేస్తున్న విష‌యం. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత‌, కేజీఎఫ్-2కు ముందు ఏమాత్రం అనుకూలంగా లేని స‌మ‌యంలో ఈ సినిమాను రిలీజ్ చేయ‌డం పెద్ద మైన‌స్ కాగా.. సినిమాకు బ్యాడ్ టాక్ రావ‌డం మ‌రింత ప్ర‌తికూల‌మైంది. మొత్తానికి గ‌నికి బాక్సాఫీస్ దెబ్బ మామూలుగా లేదు. క‌నీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేక‌, తొలి రోజే థియేట‌ర్లు వెల‌వెల‌బోయాయి.

వీకెండ్ కదా పుంజుకుంటుందిలే అని ఆశిస్తే.. శ‌ని, ఆదివారాల్లో కూడా ప‌రిస్థితి ఏమీ మెరుగుప‌డ‌లేదు. అస‌లు ఈ సినిమా రిలీజైన సంగ‌తే జ‌నాలు గుర్తించ‌ట్లేదు. కోరుకున్న‌న్ని థియేట‌ర్లు దొరికినా.. వ‌సూళ్లు లేక‌, షోలు క్యాన్సిల్ చేసి ఆర్ఆర్ఆర్‌నే ఆడించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. ఫుల్ ర‌న్లో క‌నీసం రూ.3 కోట్ల షేర్ రాబ‌ట్ట‌లేని స్థితిలో గ‌ని వ‌రుణ్ కెరీర్లో అతి పెద్ద‌ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌బోతోంది. ఎంత నెగెటివ్ టాక్ వ‌చ్చినా స‌రే.. సినిమా ప‌రిస్థితి ఇంత ద‌య‌నీయంగా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.