ఆర్ఆర్ఆర్ సినిమా హిందీలో 200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది ఇప్పటిదాకా. మరీ బాహుబలి స్థాయిలో కాదు కానీ.. ఉత్తరాది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని గొప్పగానే ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో నార్త్ ఇండియన్స్ ఈ సినిమా చూసి స్పందిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. మన వాళ్ల కంటే ఉత్తరాది ప్రేక్షకులకే సినిమా ఎక్కువ నచ్చినట్లు కనిపిస్తోంది. ఐతే హిందీలో ఆర్ఆర్ఆర్ ఇంత బాగా ఆడుతుంటే.. బాలీవుడ్ సెలబ్రెటీలు మాత్రం ఏం పట్టనట్లు ఉంటున్నారు. ఆ సినిమా గురించి అక్కడి సెలబ్రెటీలెవరూ పెద్దగా స్పందించట్లేదు.
బాలీవుడ్ సినిమాలను సౌత్ మూవీస్ గట్టి దెబ్బ తీసి తమ ఉనికినే దెబ్బ తీసే పరిస్థితి కనిపిస్తుండటం.. ఆ సినిమాలను కొనియాడి వాటికి ప్రమోషన్ ఇవ్వడం ఎందుకనో ఏమో.. అక్కడి సెలబ్రెటీలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి టైంలో ఆర్ఆర్ఆర్ మీద ఓ బాలీవుడ్ లెజెండ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనెవరో కాదు.. లిరిసిస్ట్ కమ్ స్క్రిప్టు రైటర్ జావెద్ అక్తర్. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి తాను ముగ్ధుడైనట్లు ఆయన చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ను హిందీలో రిలీజ్ చేసిన జయంతి లాల్ బలవంతం మేరకు తానీ సినిమా చూసినట్లు ఆయన వెల్లడించారు.
‘‘వారం రోజులుగా జయంతి లాల్ సినిమా చూడమని అడుగుతున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చూశా. అదొక విజువల్ వండర్ లాగా అనిపించింది. సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టాం.. ఎంత కలెక్ట్ చేసింది అన్నది ముఖ్యం కాదు. ఆ సినిమా సక్సెస్ సాధించి గతంలో జరగని విధంగా ఏదన్నా కొత్తగా ఏదన్నా సృష్టిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. రాజమౌళి తీసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ అలా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.
20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి, సినిమాను ఇలా తీర్చిదిద్దడానికి టీమ్ పడిన కష్టం గురించి చెప్పుకొంటారు. చరిత్రను ఎవరైనా చెప్పగలరు. దానిని తెరపై ఎంత బాగా ప్రెజెంట్ చేశారన్నది ముఖ్యం. రాజమౌళి అదే చేసి చూపించారు. ఆయనలాంటి దర్శకుడిని చూడలేదు. ఆయన విజన్‌కు తగ్గ హీరోలు దొరకడం కూడా అదృష్టం’’ అని జావెద్ అక్తర్ పేర్కొన్నారు.