‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించిన ఇద్దరు హీరోల్లో ఎవరికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుందనే విషయంలో ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి చర్చ నడుస్తోంది. ఐతే పాత్ర పరంగా ఉన్న విస్తృతి వల్ల, పతాక సన్నివేశాల్లో వచ్చిన ఎలివేషన్ వల్ల రామ్ చరణ్ కొంచెం ఎక్కువ హైలైట్ అయిన మాట వాస్తవం. కానీ పెర్ఫామెన్స్ పరంగా చూస్తే ఇద్దరిలో ఎవ్వరూ తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే.. భావోద్వేగాలను పండించడంలో తారక్‌కు కొన్ని మార్కులు ఎక్కువే పడతాయి.
కొమురం భీముడో పాటలో అయితే కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చి అందరినీ కదిలించేశాడు. ఐతే పాత్ర పరంగా ఉన్న డామినేషన్ కారణంగా చరణ్ ఎక్కువ హైలైట్ కావడం గురించి అవసరానికి మించిన చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఈ విషయంలో చరణ్, తారక్ అభిమానుల మధ్య కూడా వాదోపవాదాలు నడుస్తున్నాయి.
ఐతే సామాన్య జనాలు దీని గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు కానీ.. ఇలాంటి సున్నితమైన విషయాన్ని విలేకరుల సమావేశంలో చర్చించకూడదు, దీనిపై ప్రశ్నలు అడగకూడదన్న ఇంగిత జ్ఞానం బాలీవుడ్ మీడియాకు లేకపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ పార్టీలో భాగంగా ముంబయిలో బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయింది చిత్ర బృందం. వేదిక మీద తారక్ కూడా కూర్చుని ఉండగా.. ఒక మహిళా విలేకరి మైకందుకుని ‘‘ఈ సినిమాతో మొత్తం ఘనతలన్నీ రామ్ చరణే పట్టుకుపోయాడు కదా’’ అంది.
చరణ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెకు జవాబు చెప్పాడు. ‘‘లేదు మేడం. నేను దీన్ని నమ్మను. ఒక్క క్షణం కూడా అలా ఆలోచించను. మేమిద్దరం బాగా నటించాం. తారక్ అద్భుతంగా చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ నేను ఆస్వాదించినంతగా మరే సినిమాకూ జరగలేదు. ఈ సినిమా నుంచి నేను పొందిన అత్యుత్తమమైన విషయం.. తారక్‌తో నా ప్రయాణం. దీన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. ఈ అవకాశాన్ని నాకిచ్చిన రాజమౌళి సర్‌కి నా ధన్యవాదాలు’’ అంటూ ఈ చర్చకు తెరదించాడు చరణ్.