చివరి రెండు సినిమాలతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు ప్రభాస్. ఐతే అతడి నుంచి రాబోయే చిత్రాలు ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న సలార్ ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ సినిమా అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
వీరికి తోడు మలయాళ స్టార్ హీరోల్లో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రకు ఎంపికయ్యాడు. కానీ అతను కొన్ని కారణాల వల్ల మధ్యలో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు పృథ్వీరాజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. తాను మధ్యలో సలార్ మూవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమే అని.. ఐతే ప్రభాస్, ప్రశాంత్ నీల్ తనను ఒప్పించి మళ్లీ ఈ ప్రాజెక్టులో భాగమయ్యేలా చేశారని పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ప్రశాంత్‌తో పాటు సలార్ చిత్ర నిర్మాతలతో తనకు మంచి అనుబంధం ఉందని.. వీళ్ల కలయికలో వచ్చిన కేజీఎఫ్ సినిమాను మలయాళంలో రిలీజ్ చేసింది తానేనని.. గత ఏడాది ప్రశాంత్ తనను కలిసి సలార్‌లో ఓ ముఖ్య పాత్రలో నటించాలని అడిగాడని.. కథ, పాత్ర నచ్చడంతో ఓకే చెప్పానని పృథ్వీరాజ్ తెలిపాడు. ఐతే కరోనా, ఇతర కారణాల వల్ల సలార్ సినిమా ఆలస్యమైందని, ఈలోపు తనవి వేరే ప్రాజెక్టులు మొదలయ్యాయని, దీంతో డేట్ల సమస్య తలెత్తి తాను సలార్‌లో నటించలేనని చెప్పేశానని తెలిపాడు.
కానీ తర్వాత ప్రశాంత్‌తో కలిసి ప్రభాస్ స్వయంగా తనను కలిసి ఈ సినిమాలో చేయాల్సిందే అని అడిగారని.. దీంతో డేట్లు సర్దుబాటు చేసుకుని మళ్లీ తాను ఈ ప్రాజెక్టులో భాగమయ్యానని పృథ్వీరాజ్ వెల్లడించాడు. పృథ్వీరాజ్ చివరగా తెలుగులో పోలీస్ పోలీస్ అనే సినిమా చేశాడు. మళ్లీ సలార్‌తో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.