టాలీవుడ్ వరకు చూస్తే కెరీర్లో చాలా వేగంగా ఎదిగిపోయాడు రామ్ చరణ్. తొలి సినిమా చిరుత హిట్ కాగా.. రెండో సినిమా మగధీర ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత ఆరెంజ్‌తో ఎదురు దెబ్బ తిన్నప్పటికీ.. రచ్చ, నాయక్ సినిమాలతో తిరిగి విజయాల బాట పట్టాడు. అలాంటి టైంలోనే అతడి చూపు బాలీవుడ్‌పై పడింది. అమితాబ్ బచ్చన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన జంజీర్ సినిమా రీమేక్‌లో చరణ్ నటించాడు. టాలీవుడ్లో వేగంగా ఎదుగుతున్న టైంలో బాలీవుడ్ అవసరమా.. పైగా అమితాబ్ సినిమాను రీమేక్ చేయడం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తాయి.
కానీ అపూర్వ లఖియా అతణ్ని ఒప్పించి ఆ సినిమా చేశాడు. ఫలితం అందరికీ తెలిసిందే. జంజీర్ పెద్ద డిజాస్టర్ కావడమే కాదు.. రామ్ చరణ్‌కు చాలా చెడ్డ పేరు తెచ్చింది. అతడి నటన గురించి బాలీవుడ్ క్రిటిక్స్ ఏకిపడేశారు. ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దెబ్బకు మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు చరణ్.
జంజీర్ కారణంగా చరణ్ మీద హిందీ ప్రేక్షకుల్లో ఒక నెగెటివ్ అభిప్రాయం పడిపోయింది.
అది అంత సులువుగా పోతుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ తనపై నెగెటివిటీనంతా చెరిపేశాడు. ఈ చిత్రంలో రామ్ పాత్ర నార్త్ ఇండియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్కడి ప్రేక్షకులు చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. జంజీర్‌లో చూసిన నటుడు ఇతనేనా, తనలో ఇంత మార్పా.. ఈ కుర్రాడిలో ఇంత ఎనర్జీ, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు.
చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్.. జంజీర్ తాలూకు మరకలన్నీ చెరిపేశాడనే భావించాలి. మున్ముందు అతడి సినిమాలన్నీ హిందీలో రిలీజవడం ఖాయం. అంతే కాక నేరుగా బాలీవుడ్ నుంచి ఛాన్సులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates