బీస్ట్.. రెండు సినిమాలు క‌లిపి కొట్టేశారా?

ఇంకో ప‌ది రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది బీస్ట్ సినిమా. త‌మిళం, తెలుగు భాష‌ల్లో పెద్ద ఎత్తునే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో ఊపు మీదున్న విజ‌య్‌తో.. కోల‌మావు కోకిల‌, డాక్ట‌ర్ సినిమాల‌తో సూప‌ర్ స‌క్సెస్‌లు అందుకున్న నెల్స‌న్ దిలీప్ కుమార్ జ‌ట్టు క‌ట్ట‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ సినిమా ట్రైల‌ర్ ఎంట‌ర్టైనింగ్‌గా ఉండి అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచింది. కాక‌పోతే ఈ ట్రైల‌ర్ చూసిన వాళ్ల‌కు ఏవేవో సినిమాలు, వెబ్ సిరీస్‌లు గుర్తుకు వ‌స్తున్నాయి. ఒక బిల్డింగ్‌లో ఉన్న మ‌నుషుల్ని బందీలుగా తీసుకుని దుండుగులు ప్ర‌భుత్వం ముందు డిమాండ్లు పెట్ట‌డం.. దీని మీద ఓ పోలీస్ అధికారి త‌న టీంతో ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌డం.. ఈ నేప‌థ్యంలో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వ‌చ్చాయి. వెబ్ సిరీస్‌ల్లో అయితే ఈ నేప‌థ్యంలో వ‌రుస‌గా సిరీస్‌లు వ‌స్తూనే ఉన్నాయి.

బీస్ట్ మూవీ విష‌యంలో ద‌ర్శ‌కుడు నెల్స‌న్ ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల నుంచి బాగానే ఇన్‌స్పైర్ అయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఓ హాలీవుడ్ మూవీ, ఓ క‌న్న‌డ చిత్రంతో బీస్ట్‌కు బాగా పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. 2009లో రిలీజైన మాల్ కాప్ అనే సినిమాతో బీస్ట్‌కు బాగా పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అందులో హీరో ఒక సెక్యూరిటీ గార్డ్. అత‌నే హైజాక‌ర్ల నుంచి జ‌నాల్ని ర‌క్షిస్తాడు. ఇది కాస్త లేటెస్ట్ మూవీనే కానీ.. దీని కంటే ఒక ద‌శాబ్దంన్న‌ర ముందు వ‌చ్చిన ఓ చిత్రం సైతం బీస్ట్‌కు స్ఫూర్తిగా నిలిచింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆ సినిమా పేరు నిష్క‌ర్ష. 1993లో రిలీజైన ఈ చిత్రంలో అప్ప‌టి సూప‌ర్ స్టార్ల‌లో ఒక‌డైన విష్ణువ‌ర్ధ‌న్ హీరోగా నటించాడు. ఒక బిల్డింగ్‌లో జ‌నాల్ని బందీలుగా తీసుకున్న గ్యాంగ్ మీద త‌న టీంతో క‌లిసి ఎటాక్ చేస్తాడు అందులో హీరో. సంఘ‌ట‌న పేరుతో దీని తెలుగు అనువాద వెర్ష‌న్ యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. అది చూస్తే.. బీస్ట్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా అనిపిస్తోంది. మ‌రి  ఈ సినిమాల నుంచి కేవ‌లం ఇన్‌స్పైర్ అయ్యారా, కాపీ కొట్టారా అన్న‌ది బీస్ట్ రిలీజ‌య్యాక కానీ తెలియ‌దు.