వామ్మో ఆర్ఆర్ఆర్.. ఇదేం మోత‌ర‌య్యో

ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. రెండో వారానికి వ‌చ్చేసరికి బాక్సాఫీస్ జోరు త‌గ్గుతుంది. వీకెండ్లో మంచి వ‌సూళ్లే రాబ‌ట్టొచ్చు కానీ.. మ‌రీ తొలి వారాంతానికి దీటుగా అంటే క‌ష్టం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ శ‌నివారం సాధించిన వ‌సూళ్ల‌ను చూసి ట్రేడ్ పండిట్లకు దిమ్మ‌దిరిగిపోతోంది. ఫ‌స్ట్ వీకెండ్లో శ‌నివారానికి దీటుగా రెండో శ‌నివారం వ‌సూళ్లు ఉండ‌డం.. ఒక కొత్త సినిమా రిలీజైన స్థాయిలో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంద‌డి నెల‌కొనడం చూసి విస్తుబోతున్నారు.

రిలీజైన తొమ్మిదో రోజు ఆర్ఆర్ఆర్ వ‌ర‌ల్డ్ వైడ్ 50 కోట్ల దాకా షేర్ రాబ‌ట్టిన‌ట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఈ వారం రిలీజైన మిష‌న్ ఇంపాజిబుల్ సినిమా ఏమాత్రం ప్ర‌భావం చూప‌క‌పోవ‌డం, పోటీలో మ‌రే సినిమా లేక‌పోవ‌డం, శ‌నివారం వీకెండ్, పైగా ఉగాది సెల‌వు క‌లిసి రావ‌డం తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ఈ చిత్రం 25-30 కోట్ల‌ షేర్ రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఒక్క నైజాంలోనే రూ.10 కోట్ల దాకా షేర్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు.

హిందీలో ఆర్ఆర్ఆర్ సంచ‌ల‌నాలు మామూలుగా లేవు. తొలి వీకెండ్‌ను మించి వ‌సూళ్లు ఎక్క‌డికో వెళ్లిపోయాయి. శ‌నివారం ఈ చిత్రం హిందీ మార్కెట్ వ‌ర‌కే ఏకంగా రూ.20 కోట్ల నెట్ వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు అక్క‌డి ట్రేడ్ పండిట్లు ప్ర‌క‌టించ‌డం చూసి బాలీవుడ్ వాళ్ల‌కే దిమ్మ‌దిరిగిపోయింది. ఈ వారం కొత్త‌గా రిలీజైన హిందీ సినిమా ఎటాక్.. ఇందులో నాలుగో వంతు వ‌సూళ్లు కూడా రాబ‌ట్ట‌లేదు.

ఇండియాలోని మిగ‌తా ప్రాంతాల్లో కూడా రెండో వీకెండ్లో ఆర్ఆర్ఆర్ సంచ‌ల‌న వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్ర వ‌సూళ్లు రూ.800 కోట్ల మార్కును దాటేసిన‌ట్లే క‌నిపిస్తోంది. ఫుల్ రన్లో వ‌సూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటేయ‌డం లాంఛ‌న‌మే కావ‌చ్చు. బాహుబ‌లి-2 రికార్డుల‌కు ఇప్ప‌టికే చాలా చోట్ల ఆర్ఆర్ఆర్ గండి కొట్టేసింది. ఇంకా ఈ సినిమా సంచ‌ల‌నాలు ఎక్క‌డిదాకా వెళ్తాయో చూడాలి.