ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైన దగ్గర్నుంచి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ హైలైట్ అవుతాడా.. రామ్ చరణ్ పైచేయి సాధిస్తాడా అనే విషయంలో ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఏ చిన్న ప్రోమో రిలీజైనా ఈ రకమైన పోలికలు తప్పలేదు. ఇక సినిమా రిలీజయ్యాక కూడా హాట్ టాపిక్‌గా ఉంటోంది. సినిమాలో రామ్ చరణ్ ఎక్కువ హైలైట్ అయ్యాడని.. తారక్ పాత్రను తగ్గించేశారని.. ముఖ్యంగా చివరి అరగంటలో రాజమౌళి సమతూకం పాటించలేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయంలో ఈ చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ దగ్గర ప్రస్తావిస్తే.. ఇలా పోలికలు పెట్టేవారి మీద ఆయన మండిపడ్డారు. సినిమాలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనుకోవడానికి అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇద్దరు హీరోలు ఒకరిని చూసి ఒకరు ఇన్‌స్పైర్ అయ్యేలాగా సమతూకంతో ఆ పాత్రలను తీర్చిదిద్దినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రామ్ చరణ్ అల్లూరి అవతారంలో హైలైట్ అయ్యాడని అంటున్న వారికి సమాధానం చెబుతూ.. అసలు ఆ పాత్రను అల్లూరిలా మార్చింది ఎవరని ఆయన ప్రశ్నించారు.
రామ్ గాయానికి కట్టుగట్టి అతడికి బాణాలు, కాషాయ వస్త్రాలు ఇచ్చి అల్లూరి అవతారంలోకి మార్చింది, అంతకుముందు కొమురం భీముడో పాత్రతో ఇన్‌స్పైర్ చేసింది భీమ్‌యే కదా అని ఆయన అన్నారు. ఇలా రామ్‌ను భీమ్ ఇన్‌స్పైర్ చేస్తే.. తనతో పాటు అందరూ చదువుకునేలా భీమ్‌ను రామ్ ఇన్‌స్పైర్ చేస్తాడని.. ఇలా ఒకరినొకరు ఇన్‌స్పైర్ చేసుకున్న వాళ్లలో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అంటే ఏం సమాధానం చెబుతామని ఆయన అన్నారు.
కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్లు.. ఎన్టీఆర్‌కు లేని బాధ మిగతా వారికి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్రకు వచ్చిన స్పందన పట్ల తారక్ ఉద్వేగానికి గురయ్యాడని, అంతే కాక తన కెరీర్‌ను ఆర్ఆర్ఆర్‌కు ముందు, ఆర్ఆర్ఆర్‌కు తర్వాత విభజించి చూడాలని అంటున్నాడని, ఇంతగా అతను ఈ సినిమా గురించి చెబుతుంటే అతడి పాత్ర తగ్గిందని బాధ పడటంతో అర్థం లేదని విజయేంద్ర తేల్చేశారు.