పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు ఎంత అభిమానమో పలు సందర్భాల్లో ఆయన మాటల్ని బట్టి అందరికీ అర్థమైంది. పవన్ ప్రస్తావన వస్తే చాలా గొప్పగా మాట్లాడతాడు ఆయన. బాహుబలి: ది కంక్లూజన్ ఇంటర్వెల్‌కు పవనే స్ఫూర్తి అని కూడా ఆయన గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఇంత అభిమానం ఉన్న నటుడిని 2000 ప్రాంతంలో అసలు గుర్తించనే లేదట విజయేంద్ర ప్రసాద్.
అది జరిగింది చెన్నై నుంచి విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్‌కు మకాం మార్చిన రోజుల్లోనట. పవన్ అప్పటికే సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు లాంటి సూపర్ హిట్లతో మంచి పేరే సంపాదించాడు. చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపు నుంచి సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి టైంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సుదర్శన క్రియ మీద హైదరాబాద్‌లో క్లాసులు పెడితే.. తన స్నేహితుడైన ప్రసాద్ అనే రైటర్ సూచన మేరకు ఆ క్లాస్‌కు తాను అటెండ్ అయినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
అక్కడికి పవన్ కళ్యాణ్ కూడా రాగా.. ప్రసాద్ అతడికి తనను పరిచయం చేశాడని, అప్పుడు పవన్‌ను చూసి తాను ఎవరితను అని అడిగానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పవన్ అప్పటికే మంచి గుర్తింపు సంపాదించినప్పటికీ.. ఆయన్ని గుర్తు పట్టలేకపోవడం తన తెలివి తక్కువ తనమని విజయేంద్ర చెప్పారు. ఇది దృష్టిలో పెట్టుకుంటే పవన్ తనకు ఎప్పటికీ అవకాశం ఇవ్వడేమో అని ఆయనన్నారు.
పవన్ అంటే తనకు సినిమా పరంగానే కాక వ్యక్తిగతంగానూ చాలా చాలా ఇష్టమని.. తెలుగులో అతణ్ని మ్యాచ్ చేసే స్టార్ లేడని.. ఆయనతో పని చేయాలని తనకూ ఉందని, కానీ పవన్ డేట్లతో ఇప్పటిదాకా ఏ నిర్మాతా వచ్చి సినిమా చేయమని అడగలేదని.. భవిష్యత్తులో తనతో సినిమా చేసే అవకాశం వస్తుందేమో చూడాలని విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates