క్రాస్ రోడ్స్‌లో ఆర్ఆర్ఆర్ ప్ర‌భంజ‌నం

ఒక సినిమా ఒకే థియేటర్లో కోటి రూపాయల కలెక్షన్ రాబడితే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్లం కొన్నేళ్ల ముందు వరకు. ఐతే పెద్ద సినిమాలు రిలీజై, పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ అన్నది మామూలు విషయం అయిపోయింది ఈ మధ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి థియేటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటున్నాయి.

హైదరాబాద్ వరకు తీసుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మెయిన్ థియేటర్, అలాగే ఏఎంబీ సినిమాస్ లాంటి చోట్ల కోటి రూపాయల గ్రాస్ కేక్ వాక్ అయిపోయింది. ఐతే ఒక థియేటర్లో ఒక సినిమా రూ.2 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టే రోజులు కూడా వ‌చ్చేసిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఘ‌న‌త దిశ‌గా దూసుకెళ్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా మెయిన్ థియేట‌ర్ అయిన సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో రూ.2 కోట్ల గ్రాస్‌కు చేరువ‌గా ఉందీ చిత్రం. మొత్తంగా క్రాస్ రోడ్స్‌లో ఈ సినిమా రూ.4 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువ‌గా ఉండ‌టం విశేషం.

ఫుల్ ర‌న్లో ఈ ఒక్క ఏరియా నుంచి రూ.5 కోట్లకు గ్రాస్ క‌లెక్ట్ చేయ‌డం లాంఛ‌నంగానే క‌నిపిస్తోంది. ఇది ఆల్ టైం రికార్డ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక సినిమా ఒక సిటీలోని ఒక చిన్న ఏరియాలో 5 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేయ‌డం అన్న‌ది అసామాన్య‌మైన విష‌యం. రెండో వారంలోనూ క్రాస్ రోడ్స్‌లో నాలుగు థియేట‌ర్ల‌లో ఆర్ఆర్ఆర్ ఆడుతోంది.

తొలి వీకెండ్లో ఇంకా ఎక్కువ థియేట‌ర్ల‌లో సినిమాను న‌డిపించారు. అన్ని థియేట‌ర్లూ హౌస్ ఫుల్స్‌తో న‌డిచాయి. రెండో వీకెండ్లోనూ ఇక్క‌డ ఆర్ఆర్ఆర్ ఆడుతున్న అన్ని థియేట‌ర్ల‌లో హౌస్ ఫుల్స్ ఖాయంగా క‌నిపిస్తోంది. వీక్ డేస్‌లో కొంత త‌గ్గిన ఆక్యుపెన్సీ వీకెండ్‌కు వ‌చ్చేసరికి పుంజుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. కొత్త సినిమాల ప్ర‌భావం ఆర్ఆర్ఆర్ మీద ఏమాత్రం క‌నిపించ‌ట్లేదు.