ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేదికపై అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారం అందుకున్న సూపర్ స్టార్ విల్ స్మిత్.. తన భార్య మీద జోక్ పేల్చినందుకు వ్యాఖ్యాత, కమెడియన్ క్రిస్ రాక్ చెంప పగలగొట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఒక వ్యాధి కారణంగా స్మిత్ భార్య జుట్టు మొత్తం ఊడిపోగా.. హీరోయిన్ గుండుతో కనిపించే ఓ సినిమాకు ఆమె సీక్వెల్ చేయబోతోందా అంటూ రాక్ జోక్ పేల్చడం స్మిత్‌కు నచ్చలేదు. ఆగ్రహం పట్టలేక వెంటనే వేదిక మీదికెళ్లి రాక్ చెంప చెల్లుమనిపించేశాడు స్మిత్. ఈ విషయంలో చాలామంది స్మిత్‌ను సమర్థించారు. సీరియస్ విషయాలపై జోకులేస్తే ఇలాగే స్పందించాలన్నారు.
అదే సమయంలో స్మిత్ మరీ అంత దురుసుగా ప్రవర్తించాల్సింది కాదన్న అభిప్రాయం కొందరిలో వ్యక్తమైంది. ఐతే కారణం ఏదైనప్పటికీ.. బహిరంగ వేదికలో ఒక వ్యక్తిపై చేయి చేసుకున్నందుకు స్మిత్ అరెస్ట్ కాబోతున్నట్లుగా మీడియాలో వార్తలొస్తున్నాయి.
స్మిత్‌పై చర్యలు చేపట్టాలని ఆస్కార్ అవార్డుల కమిటీనే ముందుగా నిర్ణయం తీసుకుంది. తాజాగా అకాడమీ గవర్నర్ల బోర్డు తాజాగా సమావేశమై స్మిత్ ప్రవర్తనను తీవ్రంగా ఖండించింది. స్మిత్‌పై చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఈ సమావేశానంతరం కమిటీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. పోలీసులు స్మిత్‌ను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారని, ఎప్పుడైనా అతడి అరెస్ట్ ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఇలాంటి ప్రతిష్టాత్మక వేడుకలో, వేదిక మీద ఒక నామినీ ఇలా ప్రవర్తించడాన్ని తాము జీర్ణించుకోలేకపోయామని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, స్మిత్ హద్దు మీరాడని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ పేర్కొంది. స్మిత్ ప్రవర్తన పట్ల.. రాక్‌కు ఈ సంస్థ క్షమాపణలు చెప్పింది. ఆ సమయంలో సంయమనంతో వ్యవహరించినందుకు రాక్‌ను అభినందించింది. స్మిత్‌పై చర్యలు చేపట్టాలని ఆ సంస్థ అకాడమీకి సూచించిన నేపథ్యంలో గవర్నర్ల బోర్డు సమావేశమైంది.