ఆమెను తప్పించి రష్మికకు ఇచ్చేశారు

కన్నడలో ‘కిరిక్ పార్టీ’ అనే ఓ చిన్న సినిమాతో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ఆరంభించి, ఆ చిత్రం సూపర్ హిట్టవడంతో రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్నా. ఇక తెలుగులో ఆమె రైజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ కూడా ‘ఛలో’ అనే చిన్న సినిమాతోనే కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయిపోయింది.

గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి హిట్లు ఆమె రాత మార్చేశాయి. ఆమె ఆల్రెడీ తమిళంలో కూడా అడుగు పెట్టేసింది. అక్కడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ లోపు హిందీలోనూ ఛాన్సులు పట్టేసింది. అక్కడ మిషన్ మజ్ను, గుడ్ బై అనే రెండు చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిని మించి ఇప్పుడు బాలీవుడ్లో ఒక క్రేజీ ఆఫర్ పట్టేసింది రష్మిక. టాలీవుడ్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఎనిమల్’లో రష్మికనే కథానాయికగా ఖరారవడం విశేషం. 

ముందు ఈ చిత్రానికి హీరోయిన్‌గా అనుకున్నది పరిణీతి చోప్రాను. ఆమె మీద కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఆమె ఈ పాత్రకు ఫిట్ కాదనుకున్నారో, లేక పెద్దగా డిమాండ్ లేని పరిణీతి సినిమాకు మైనస్ అవుతుందనుకున్నారో ఏమో కానీ.. ఇప్పుడు ఆమె స్థానంలోకి రష్మికను తీసుకున్నారు. రష్మికకు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు.

ఆమె చేతిలో ఉన్న హిందీ సినిమాలన్నీ విజయవంతం అయితే ఇండియాలోనే టాప్ హీరోయిన్లలో ఒకరిగా రష్మిక నిలుస్తుందనడంలో సందేహం లేదు. ‘ఎనిమల్’లో సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. బాలీవుడ్లో అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’తో భారీ విజయాన్నందుకున్న సందీప్.. ఆ తర్వాత చేస్తున్న చిత్రమిదే కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. దీని తర్వాత అతను ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ‘ఎనిమల్’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.