కృతి శెట్టిని ఎలా చూపిస్తాడో ఏమో?

కొన్నేళ్ల నుంచి తమిళ స్టార్ హీరో సూర్య కెరీర్ ఒడుదొడుకులతో సాగుతోంది. థియేట్రికల్ రిలీజ్‌తో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. కరోనా టైంలో అతడి రెండు చిత్రాలు ఓటీటీ ద్వారా రిలీజయ్యాయి. అవే.. ఆకాశం నీ హద్దురా, జై భీమ్. ఈ రెంటికీ అద్భుతమైన స్పందన వచ్చింది. కానీ ఓటీటీ రిలీజ్ కావడం వల్ల అవి బాక్సాఫీస్ సక్సెస్‌లుగా చెప్పుకోలేని పరిస్థితి. ఈ మధ్యే ‘ఈటి’ సినిమాతో మళ్లీ సూర్య థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.

అతడికిక్కడ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. తమిళనాట ఓపెనింగ్స్ వరకు పర్లేదు కానీ.. తర్వాత తేలిపోయింది. తెలుగులో అయితే ఈ సినిమా డిజాస్టరే. ఐతే ఈ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా క్రేజీ చిత్రాలను లైన్లో పెడుతున్నాడు సూర్య. ప్రస్తుతం తమిళంలో టాప్ డైరెక్టర్లలో ఒకడైన వెట్రిమారన్‌తో సూర్య చేయబోతున్న ‘వడివాసల్’ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది.

ఇప్పుడు సూర్య ఇంకో ఆసక్తికర చిత్రాన్ని ప్రకటించాడు. లెజెండరీ డైరెక్టర్ బాలతో అతడి కొత్త సినిమా రాబోతోంది. వీరి కలయికపై భారీ అంచనాలే ఉన్నాయి. విక్రమ్ లాగే సూర్యకు కూడా కెరీర్ ఆరంభంలో బ్రేక్ ఇచ్చిన ఘనత బాలదే. సూర్యతో అతను చేసిన నంద, పితామగన్ (శివపుత్రుడు) గొప్ప విజయం సాధించాయి. ‘పితామగన్’లో విక్రమే ఎక్కువ హైలైట్ అయినప్పటికీ.. సూర్యకు కూడా తక్కువ పేరు రాలేదు. ఆ తర్వాత ఇద్దరి కలయికలో సినిమా రాలేదు.

గత కొన్నేళ్లలో బాల నుంచి సరైన సినిమా రాక ఆయన స్థాయి తగ్గింది. ఇలాంటి టైంలో బాలతో సినిమా చేయడానికి సూర్య రెడీ అయ్యాడు. ఇందులో కథానాయికగా నటించబోయేది టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి కావడం విశేషం. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. ‘ఉప్పెన’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కృతికి తమిళంలో ఇదే తొలి సినిమా. హీరోలతో పాటు హీరోయిన్లనూ డీగ్లామరస్‌గా చూపించే బాల.. కృతికి ఎలాంటి పాత్ర ఆఫర్ చేశాడో.. ఆమెను ఎలా చూపిస్తాడో ఏమో మరి.