ఆర్ఆర్ఆర్.. వాళ్లు రుచి మ‌రిగారు

ఆర్ఆర్ఆర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల అడ్వాన్స్ బుకింగ్స్ చూసి.. బాహుబ‌లి మ్యాజిక్‌ను ఇది రిపీట్ చేసే ఛాన్సే లేద‌ని… స్వ‌యంగా రాజ‌మౌళి సైతం బాహుబ‌లిని మ‌రిపించ‌లేక‌పోతున్నాడ‌ని.. అన్నిసార్లూ అద్భుతాలు జ‌రిగిపోవ‌ని కామెంట్లు చేశారు. పైగా బాహుబ‌లితో పోల్చి చూస్తే  సినిమా కూడా ఆ స్థాయిలో లేక‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఈ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌స్తున్న స్పంద‌న చూసి ఇప్పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

క‌శ్మీర్ ఫైల్స్ ఊపు ముందు ఆర్ఆర్ఆర్ అస‌లు నిలుస్తుందా అని చాలామంది సందేహించారు కానీ.. తొలి రోజు హిందీ వెర్ష‌న్ రూ.20 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి స‌త్తా చాటుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ ప్ర‌కారం చూస్తే ఆర్ఆర్ఆర్ అంచ‌నాల‌ను మించిన‌ట్లే లెక్క.
అయినా స‌రే.. ప్ర‌భాస్ సినిమా సాహోతో పోలిస్తే హిందీలో తొలి రోజు ఐదు కోట్లు త‌క్కువే క‌లెక్ట్ చేఇందంటూ ఆర్ఆర్ఆర్‌ను త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

కానీ సాహోకు ఉన్నంత‌గా ఆర్ఆర్ఆర్‌కు రిలీజ్ ముంగిట అనుకూల ప‌రిస్థితి లేదు. అయినా ఉన్నంత‌లో తొలి రోజు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. ఇక రెండో రోజు ఈ సినిమాకు హిందీ బెల్ట్‌లో తొలి రోజును మించి వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లుగా బాలీవుడ్ ట్రేడ్ పండిట్లు చెబుతుండ‌టం విశేషం. శ‌నివారం ఆర్ఆర్ఆర్ హిందీ వెర్ష‌న్ రూ.26-28 కోట్ల మ‌ధ్య గ్రాస్ క‌లెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

సోమ‌వారం ఫుల్ ఫిగ‌ర్స్ బ‌య‌టికి రావ‌చ్చు. నిజంగా ఈ లెక్క‌లు నిజ‌మే అయితే నార్త్ ఇండియ‌న్స్ ఆర్ఆర్ఆర్ రుచి మ‌రిగిన‌ట్లే. అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు సినిమా బాగా ఎక్కేసిన‌ట్లే. బాహుబ‌లి-1, పుష్ప సినిమాల్లాగే ఆర్ఆర్ఆర్‌కు కూడా అంత‌కంత‌కూ క‌లెక్ష‌న్లు పెరిగి సినిమా ఎక్క‌డికో వెళ్లిపోవ‌డం ఖాయం. ఈ ఊపులో ముందుకు వెళ్తే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును అందుకోవ‌డం గ్యారెంటీ.