బాహుబలి తర్వాత రాజమౌళి ఎవరితో, ఎలాంటి సినిమా తీసినా.. దేశవ్యాప్తంగా ఎగబడి చూస్తారనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లతో, బాహుబలికి దీటైన ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రం తీసినా.. తెలుగు రాష్ట్రాల అవతల అనుకున్నంత క్రేజ్ కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకలో ఏ తెలుగు సినిమా రిలీజైనా హంగామా ఉంటుంది. కానీ తమిళనాడు, కేరళ, అలాగే నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ ప్రభావం అనుకున్నంతగా కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. ముఖ్యంగా నార్త్‌లో బుకింగ్స్ చాలా డల్లుగా ఉండటం చిత్ర బృందానికి మింగుడు పడటం లేదు. అక్కడి ప్రేక్షకులంతా కశ్మీర్ ఫైల్స్ మాయలో ఉండటం వల్ల దీన్ని విస్మరిస్తున్నారా.. లేక బేసిగ్గానే ఆర్ఆర్ఆర్ వాళ్ల దృష్టిని ఆకర్షించడం లేదా అన్నది ప్రశ్న.
ఐతే కారణాలేవైనప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ అయితే అంత బాగా లేదు. అలాగని ఆశలు కోల్పోవాల్సిన పని లేదు. ప్రభాస్ లాగా తమ హీరోలు కూడా ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటారనుకున్న తారక్, చరణ్ అభిమానులు కూడా డీలా పడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే బాహుబలి: ది బిగినింగ్ రిలీజైనపుడు కూడా ఇదే పరిస్థితి ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ మరీ గొప్పగా ఏమీ లేవు. ఆక్యుపెన్సీ తక్కువగానే కనిపించింది. కానీ సినిమా రిలీజయ్యాక కథ మారిపోయింది.
పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. జనం విరగబడ్డారు. ఇక బాహుబలి-2 సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే మ్యాజిక్ పునరావృతం అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. బేసిగ్గా బాహుబలి లాంటి విజువల్ వండర్ కాకపోవడం వల్ల ఇప్పటికి ఈ సినిమా పెద్దగా ఆకర్షించలేకపోయినా.. సినిమాలోని యాక్షన్, ఎమోషన్లు, మాస్ అంశాలు కచ్చితంగా ఉత్తరాది ప్రేక్షకులను అలరిస్తాయని.. బాహుబలి స్థాయిలో కాకపోయినా కచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద విజయమే సాధించడం గ్యారెంటీ అని అంటున్నారు.