‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. ఆ సినిమా భాషలు, రాష్ట్రాల సరిహద్దుల్ని చెరిపేసి దేశవ్యాప్తంగా ఇరగాడేసింది. తెలుగు రాష్ట్రాల అవతల ‘బాహుబలి: ది బిగినింగ్’ ఆరంభంలో మామూలుగానే మొదలైనప్పటికీ.. తర్వాత గొప్పగా పుంజుకుని వసూళ్ల మోగ మోగించింది. ఇక బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఉత్కంఠలోకి నెట్టడం ద్వారా ‘ది కంక్లూజన్’కు జక్కన్న తెచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.
ఇక ఆ సినిమా రిలీజైనపుడు దేశవ్యాప్తంగా ఒకే రకమైన హైప్ కనిపించింది. నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఈ చిత్రం సంచలన వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి పోటీ అన్నదే లేకపోయింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజ్ టైంలో ఉన్న యుఫోరియాను స్వయంగా రాజమౌళే ఇంకో సినిమాకు మళ్లీ తీసుకు రాలేకపోవచ్చన్న అభిప్రాయం కలిగింది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సందర్భంగా పరిస్థితి చూస్తుంటే ఇది నిజమే అని ఒప్పుకోక తప్పట్లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి-2’కు చూసిన హంగామానే ఇప్పుడూ కనిపిస్తోంది. కానీ బౌండరీల అవతల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరు స్థాయిలోనే ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ప్రభంజనం సాగుతుండటంతో ‘ఆర్ఆర్ఆర్’కు అనుకున్నంత హైప్ కనిపించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే చాలా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చినప్పటికీ.. ‘బాహుబలి’ స్థాయిలో ఐతే నార్త్ ఇండియన్స్, సౌత్‌లోని మిగతా రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదన్నది స్పష్టం. అలాగని రాజమౌళిని, ఆయన సినిమాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
ఒకసారి బొమ్మ పడ్డాక కచ్చితంగా పరిస్థితిమారుతుందని భావిస్తున్నారు. రాజమౌళిలోనూ ఈ ధీమా కనిపిస్తోంది. ఇప్పుడు జక్కన్న స్టామినాకు ఒక రకంగా పరీక్షా సమయం ఎదురవుతున్నట్లే. ‘కశ్మీర్ ఫైల్స్’ విసురుతున్న సవాల్‌ను ఛేదించి ‘ఆర్ఆర్ఆర్’ వైపు ప్రేక్షకులను లాగడం ఆయనకు అతి పెద్ద సవాలుగా మారనుంది. ఈ సవాల్‌ను జక్కన్న ఛేదించి తెలుగు రాష్ట్రాల అవతల ‘బాహుబలి’ స్థాయిలో కాకపోయినా దాని దగ్గరగా నిలిచే స్థాయిలో సినిమాను విజయవంతం చేయగలిగితే ఇండియాలో ఇప్పుడు జక్కన్నను మించిన దర్శకుడు లేడని ధీమాగా చెప్పొచ్చు.