మూడేళ్ల తర్వాత ఫలితాలు.. విజేతగా విశాల్!

ఈ మధ్య టాలీవుడ్లో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. గతంలో ‘మా’కు ఎన్నికలు జరుగుతుంటే  అసలు మీడియాలో చర్చే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇది సాధారణ ఎన్నికల స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, అనేక వివాదాలతో ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కాయి.

ఐతే ఈ ఒరవడి కేవలం తెలుగుకే పరిమితం కాదు. దీని కంటే ముందు తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికలు సైతం ఇదే స్థాయిలో వివాదాస్పదం అయ్యాయి. శరత్ కుమార్ నేతృత్వంలోని ప్యానెల్ మీద నాజర్-విశాల్-కార్తి ప్యానెల్ పోటీ చేసి గెలిచినపుడు ఆ ఎన్నికల గురించి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ప్యానెల్ రెండేళ్ల వ్యవధిలో ఓ మోస్తరు పనితీరునే కనబరిచింది కానీ.. మరీ అద్భుతాలైతే చేయలేదు.

ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట జరిగిన తర్వాతి ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.నాజర్ నాయకత్వంలో మరోసారి ఈ ప్యానెల్ పోటీకి దిగగా.. సీనియర్ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ నాయకత్వంలో శంకర్ దాస్ జట్టు వారికి ఎదురుగా పోటీ పడింది. ఐతే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శంకర్ దాస్ కోర్టుకు ఎక్కడంతో ఫలితాల వెల్లడి ఆగిపోయింది. ఈ వ్యవహారం మూడేళ్లుగా కోర్టులోనే నానుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో ఈ కేసుకు ముగింపు పలికింది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని, ఎన్నికల ఫలితాలు ప్రకటించవచ్చని తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన మూడేళ్లు ఓట్ల లెక్కింపు చేపట్టారు. మళ్లీ నాజర్-విశాల్-కార్తిల ప్యానెలే భారీ ఆధిక్యంతో ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తన కొత్త చిత్రం ‘లాఠి’ సెట్స్‌లో విశాల్ అండ్ టీం విజయోత్సవ సంబరాలు చేసుకుంది. ఐతే ఎన్నికల ఫలితాల నిలుపుదలతో నడిగర్ సంఘంలో గత మూడేళ్లు పెద్దగా యాక్టివిటీ ఏమీ లేదు. నాజర్ అండ్ కో పదవీ కాలాన్ని ముందు నుంచి లెక్కించేట్లయితే ఇప్పటికే వాళ్ల టెర్మ్ పూర్తయినట్లవుతుంది. లేదంటే ఇక్కడి నుంచి కొత్తగా టర్మ్ మొదలవుతుంది.