క‌శ్మీర్ ఫైల్స్.. రూ.300 కోట్లా?

ప‌ది రోజుల నుంచి ప‌త్రిక‌లు, టీవీలు, సోష‌ల్ మీడియా.. ఇలా ఎక్క‌డ చూసినా క‌శ్మీర్ ఫైల్స్ సంచ‌ల‌నాల గురించే చ‌ర్చ‌. త‌క్కువ బ‌డ్జెట్లో, కేవ‌లం నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని.. సెన్సార్ బోర్డు ద‌గ్గ‌ర స‌మ‌స్య‌లెదుర్కొని.. అతి క‌ష్టం మీద‌.. ప‌రిమిత సంఖ్య‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన చిత్ర‌మిది. ఈ సినిమా రిలీజ‌వుతున్నపుడు ఎవ‌రూ దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌లేదు.

కానీ తొలి రోజు అదిరిపోయే టాక్ తెచ్చుకుని.. జ‌నాల్లో విప‌రీత‌మైన ఆస‌క్తి రేకెత్తించి.. కొన్ని వివాదాలూ తోడ‌వ‌డంతో సినిమా ఎక్క‌డికో వెళ్లిపోయింది. స్క్రీన్లు, షోలు, వ‌సూళ్లు అమాంతం పెరిగిపోయాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రేడ్ పండిట్లు క‌శ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ రేంజ్ గురించి కొత్త‌గా అంచ‌నాలు క‌ట్ట‌డం.. సినిమా ఆ అంచ‌నాలను మించి ముందుకు వెళ్లిపోవ‌డం.. ఇదీ ప‌ది రోజులుగా న‌డుస్తున్న ట్రెండ్.

ముందేమో వంద కోట్ల సినిమా అన్నారు. త‌ర్వాత 200 కోట్లు క‌లెక్ట్ చేయొచ్చ‌న్నారు. కానీ ఇప్పుడు అల‌వోక‌గా రూ.300 కోట్ల మార్కును ఈ సినిమా దాటేసేలా క‌నిపిస్తోంది. తొలి రోజు అటు ఇటుగా మూడు కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండో ఆదివారం ఏకంగా రూ.30 కోట్ల గ్రాస్ మార్కును టార్గెట్ చేయ‌డం విశేషం. రిలీజ్ రోజు వ‌సూళ్ల‌తో పోలిస్తే ప‌దో రోజు క‌లెక్ష‌న్లు ప‌ది రెట్లు ఉండ‌టం అన్న‌ది అసామాన్య‌మైన విష‌యం.

ఇప్ప‌టికే ఈ చిత్ర క‌లెక్ష‌న్లు రూ.170 కోట్ల‌ను దాటిపోయాయి. ఈ వారం ఆర్ఆర్ఆర్ వ‌స్తున్నా స‌రే.. క‌శ్మీర్ ఫైల్స్ జోరు త‌గ్గేలా లేదు. ఇంకో రెండు మూడు వారాలు దాని బాక్సాఫీస్ ర‌న్ కొన‌సాగేలా ఉంది. రూ.300 కోట్ల క‌లెక్ష‌న్ల మార్కును అందుకోవ‌డం గ్యారెంటీ.. అంత‌కుమించి ఈ సినిమా ఎక్క‌డిదాకా వెళ్తుందో చూడాల‌ని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ఇలాంటి ట్రెండ్ ఇండియన్ బాక్సాఫీస్‌లో చాలా అరుద‌నే చెప్పాలి.