క‌శ్మీర్ ఫైల్స్.. ఓటీటీలో ఎప్పుడు?

ది క‌శ్మీర్ ఫైల్స్.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా రేపుతున్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. విడుద‌లై వారం దాటినా హౌస్ ఫుల్స్‌తో ర‌న్ అవుతోందీ చిత్రం. తొలి వారాంతంలో కంటే రెండో వీకెండ్లో ఈ సినిమా స్క్రీన్లు, షోలు, కొన్ని రెట్లు పెర‌గ‌డం.. వ‌సూళ్లు కూడా అందుకు త‌గ్గ‌ట్లే ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఈ సినిమా సంచ‌ల‌నాల గురించి తెలుసుకుని.. దీని సంగ‌తేంటో చూద్దామ‌ని ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెడుతున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో హిందీ రాని ప్రేక్ష‌కులు సైతం ఈ సినిమా చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారు. థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌లేని వాళ్లు.. ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఐతే థియేట‌ర్ల‌లో సినిమా ఇంత బాగా ఆడుతున్నపుడు చిత్ర బృందంలో ఎవ‌రైనా ఓటీటీ రిలీజ్ గురించి ఎందుకు మాట్లాడ‌తారు? ఐతే బాలీవుడ్ మీడియా మాత్రం దీని గురించి ప్రేక్ష‌కుల‌కు హింట్ ఇచ్చేసింది.

ది క‌శ్మీర్ ఫైల్స్ చిత్ర డిజిట‌ల్ రైట్స్‌ను జీ5 సంస్థ విడుద‌ల‌కు ముందే సొంతం చేసుకుంది. మే తొలి వారంలో డిజిటల్ ప్రిమియ‌ర్స్‌కు రంగం సిద్ధం చేసింది. జీ వాళ్లు ఎప్పుడూ కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత ఓటీటీ రిలీజ్‌కు గ్యాప్ ఉండేలాగే చూసుకుంటారు. ఐతే థియేట‌ర్ల‌లో ఈ సినిమా మ‌రీ ఈ స్థాయిలో సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.

అందుకే ఓటీటీ డీల్ కూడా త‌క్కువ‌కే కుదిరింద‌ట‌. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో, త‌క్కువ బ‌డ్జెట్లో తీసేసిన సినిమా ఇది. దానికి త‌గ్గ‌ట్లే ఓటీటీ డీల్ త‌క్కువ‌కే అవ‌గొట్టారు. కానీ సినిమా ఇప్పుడు అనూహ్య విజయం సాధించింది. థియేట‌ర్ల ద్వారా నిర్మాత‌ల‌కు భారీ ఆదాయ‌మే వ‌స్తుండ‌టంతో ఓటీటీ డీల్ గురించి మ‌రీ బాధేమీ ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ ఈ సినిమాను త‌క్కువ రేటుకు సొంతం చేసుకున్న జీ సంస్థ మాత్రం జాక్ పాట్ కొట్టిన‌ట్లే.