జేమ్స్.. మామూలుగా అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు కర్ణాటక అవతల ఎవరూ మాట్లాడుకునే వారు కాదేమో. కానీ ఈ చిత్రంలో హీరోగా నటించిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కొన్ని నెలల కిందటే మరణించడంతో అతడి చివరి సినిమాగా దీనికి ఎనలేని ప్రాధాన్యం వచ్చింది.
అందులోనూ పునీత్ పుట్టిన రోజైన మార్చి 17న ‘జేమ్స్’ను రిలీజ్ చేయడంతో ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాదిన అంతటా ‘జేమ్స్’ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కర్ణాటకలో ఈ సినిమా విడుదల సందర్భంగా నెలకొన్న హడావుడి అంతా ఇంతా కాదు.
పునీత్ గౌరవార్థం ఈ వీకెండ్లో మరే కొత్త చిత్రాన్ని విడుదల చేయలేదు కన్నడ పరిశ్రమ. ఆల్రెడీ ఆడుతున్న సినిమాలను కూడా చాలా వరకు తీసేశారు. కర్ణాటకలో 80 శాతానికి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్నే రిలీజ్ చేశారు. కర్ణాటకలో తొలి రోజు అత్యధిక స్క్రీన్లలో, అత్యధిక షోలు ప్రదర్శితమైన సినిమాగా ‘జేమ్స్’ రికార్డు సృష్టించింది.
ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి తెల్లవారు జామున షోలు పడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి మోత మొదలైంది. తొలి రోజు కన్నడ సినిమాల వసూళ్ల రికార్డులన్నింటినీ ‘జేమ్స్’ బద్దలు కొట్టేసినట్లే కనిపిస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో నటీనటులు, అందరి అభిమానులూ దీన్ని తమ సినిమాగా ఆదరిస్తున్నారు.
భుజానికెత్తుకుని మోస్తున్నారు. ప్రతి థియేటర్ దగ్గర పండుగ వాతావరణమే కనిపించింది. కేవలం థియేటర్ల దగ్గరే కాదు.. కర్ణాటకలో అంతటా ప్రతి వీధిలోనూ పునీత్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎక్కడికక్కడ అన్నదానాలు, ఇతర కార్యక్రమాలు జరిగాయి గురవారు.
పునీత్ చివరి సినిమాను సెలబ్రేట్ చేసుకుంటూనే, అతడి జ్ఞాపకాలతో బాగా ఉద్వేగానికి గురయ్యారు అభిమానులు. ఎన్నో థియేటర్లు పునీత్ అభిమానులకు ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశాయి. థియేటర్లను మునుపెన్నడూ లేని స్థాయి ముస్తాబు చేశారు అభిమానులు.
ఇక థియేటర్ల లోపల పునీత్ ఎంట్రీ సీన్‌కు వస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. మన దగ్గరా స్టార్ హీరోల సినిమాల్లో ఎంట్రీ సీన్లకు ఓ రేంజిలో రెస్పాన్స్ ఉంటుంది కానీ.. ‘జేమ్స్’కు సంబంధించిన వీడియోలు మాత్రం నభూతో అనిపిస్తున్నాయి. ఇదంతా చూస్తే ఒక హీరో మీద ఇంత ప్రేమా అని కన్నడిగులే కాక బయటి వాళ్లూ ఆశ్చర్యపోతున్నారు.