ఫ్లాప్ ఇచ్చినా మ‌ళ్లీ ఛాన్సిచ్చాడు

పాగ‌ల్.. యువ క‌థానాయ‌కుడు విశ్వ‌క్ సేన్ నుంచి గ‌త ఏడాది వ‌చ్చిన సినిమా. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత డ‌ల్లుగా ఉన్న బాక్సాఫీస్‌కు కాస్త ఊపు తెచ్చిందీ చిత్రం. రిలీజ్ ముంగిట ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. స్యూర్ షాట్ హిట్ లాగా క‌నిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జ‌రిగాయి. తొలి రోజు హౌస్ ఫుల్స్ ప‌డ్డాయి. కానీ సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు లేక‌పోవ‌డంతో రెండో రోజు నుంచి పాగ‌ల్ నిల‌వ‌లేక‌పోయింది.

ఈ సినిమా మీద చాలా న‌మ్మ‌కంతో ఉన్న విశ్వ‌క్ కు నిరాశ త‌ప్ప‌లేదు. ఐతే ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో విశ్వ‌క్సేన్ మాట్లాడుతూ.. పాగ‌ల్‌తో అరంగేట్రం చేస్తున్న ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి ఎక్క‌డికో వెళ్లిపోతాడ‌ని.. అత‌ణ్ని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని, త‌న‌కు కూడా దొర‌క‌డ‌ని అన్నాడు. వెంట‌నే ద‌ర్శ‌కుడు మైక్ అందుకుని త‌ర్వాతి సినిమా నీతోనే, ఫిక్స్ చేసుకో అన్నాడు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్లో ఇంకో సినిమా రాబోతోంది.

పాగ‌ల్ సినిమా ఫ్లాప్ అయినా.. న‌రేష్ టాలెంట్‌ను న‌మ్మి ఇంకో ఛాన్సిచ్చాడు విశ్వ‌క్. వీరి క‌ల‌యిక‌లో దాస్ కా ద‌మ్కీ అనే కొత్త చిత్రం రాబోతోంది. తమ క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ తొలి సినిమా మాదిరే దీనికీ హిందీ టైటిల్ పెట్టుకున్నారు న‌రేష్‌, విశ్వ‌క్. పాగ‌ల్‌లో హీరోయిన్‌గా నటించిన నివేథా పెతురాజే ఇందులోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పేక‌ముక్క‌ల మ‌ధ్య టైటిల్‌తో వెరైటీగా క‌నిపించింది ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్. బుధ‌వార‌మే ఈ సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రిపారు. వాన్మ‌యి క్రియేష‌న్స్ బేన‌ర్ మీద కొత్త నిర్మాత‌లు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విశ్వ‌క్ తండ్రి క‌రాటె రాజు కూడా ఇందులో భాగ‌స్వామే. విశ్వ‌క్ త్వ‌ర‌లోనే అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. దీంతో పాటు అత‌డి నుంచి గామి, ఓరి దేవుడా చిత్రాలు రానున్నాయి.