వంద కోట్ల షేర్.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ల సత్తాకు బెంచ్ మార్క్ లాగా మారిన విషయం. ‘బాహుబలి’తో తిరుగులేని ఫాలోయింగ్, ఇమేజ్, మార్కెట్ సంపాదించిన ప్రభాస్‌కు ఇది కేక్ వాక్ అన్నట్లే. మిగతా స్టార్లలో ఇప్పటికే కొందరు ఈ ఫీట్ సాధించారు. రామ్ చరణ్ ‘రంగస్థలం’తో ఈ ఘనత అందుకున్నాడు. అల్లు అర్జున్‌కు ‘అల వైకుంఠపురములో’తో తొలిసారి ఆ ఫీట్ సాధ్యమైంది. జూనియర్ ఎన్టీఆర్ సోలోగా ఇంకా ఆ మార్కును టచ్ చేయలేదు.
మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, ‘సైరా’ చిత్రాలతో 100 కోట్ల షేర్ క్లబ్బులో చేరాడు. మహేష్ బాబు ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలతో ఆ మార్కును టచ్ చేశాడు. ఐతే టాలీవుడ్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోల్లో ఒకడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటిదాకా ఈ క్లబ్బులో చేరలేదు. వంద కోట్ల షేర్ మార్కు అందుకునే దిశగా తెలుగు మార్కెట్ విస్తరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌కు సరైన సినిమా పడలేదు.
‘అజ్ఞాతవాసి’కి మంచి టాక్ వచ్చి హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా పవన్ ఈ ఘనతను సాధించేవాడే. కానీ అది డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వీకెండ్లోనే పడుకుండిపోయింది. ఆ తర్వాత పవన్ రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ‘వకీల్ సాబ్’తో రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. అది లేడీ ఓరియెంటెడ్ టచ్ ఉన్న కథతో తెరకెక్కింది. పైగా రిలీజ్ టైంలో ఏపీలో టికెట్ల ధరల తగ్గింపు, కొవిడ్ ఉద్ధృతి దెబ్బ కొట్టాయి. దీంతో పవన్ లాంటి పెద్ద స్టార్ వంద కోట్ల క్లబ్బుకు దూరంగానే ఉండిపోయాడు.
ఐతే ఎట్టకేలకు పవన్ ఈ ఘనత సాధించాడు. అతడి కొత్త చిత్రం ‘భీమ్లా నాయక్’ అనేక సందేహాల మధ్య వంద కోట్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఈ చిత్రానికి కూడా ఏపీలో టికెట్ల ధరలు ప్రతికూలంగానే మారినా.. అతి కష్టం మీద వంద కోట్ల షేర్ మార్కును టచ్ చేయగలిగింది. రెండో వీకెండ్ అయ్యేసరికి వంద కోట్ల మార్కుకు అత్యంత చేరువగా వచ్చిన ‘భీమ్లా నాయక్’.. ఆ తర్వాత బాగా స్లో అయినప్పటికీ వంద కోట్ల మార్కునైతే టచ్ చేసింది. ఈ సినిమా ఓవరాల్ గ్రాస్ రూ.150 కోట్ల మార్కును దాటింది.