శ్రుతీహాసన్‌కి మెగా ఆఫర్

స్టార్ హీరో సినిమా అనగానే హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఇక చిరంజీవి లాంటి స్టార్‌‌ విషయంలో ఆ ప్రశ్న మరింత వేగంగా వస్తుంది. ఎందుకంటే చిరు సినిమాలో హీరోయిన్ కేవలం నటిస్తే చాలదు.. ఆయనతో సమానంగా డ్యాన్సులు కూడా చేయాలి.

అందుకే ఆయనకి జోడీగా నటించే అమ్మాయిని ఆచి తూచి సెలెక్ట్ చేస్తుంటారు. బాబి కూడా అదే చేశాడు. ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి ఎట్టకేలకు శ్రుతీహాసన్‌ను సెలెక్ట్ చేశాడు. చిరంజీవి 154వ సినిమా బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో షూటింగ్ కూడా మొదలైంది.

ఇందులో చిరు గ్యాంగ్‌స్టర్‌‌గా కనిపిస్తారని, అండర్ కవర్‌‌ ఏజెంట్‌గా కనిపిస్తారని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వాల్తేరు మొనగాడు అనే టైటిల్‌ పెడుతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్‌ విషయంలోనూ రకరకాల పేర్లు వినిపించాయి. చివరికి శ్రుతిని సెలెక్ట్ అయ్యింది.       

ఉమెన్స్ డే సందర్భంగా శ్రుతి పేరును అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రుతి, చిరంజీవి, బాబి కలిసున్న ఫొటోస్‌ని కూడా రిలీజ్ చేశారు. శ్రుతి తమ టీమ్‌లో చేరడం ఆనదంగా ఉందంటూ ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్‌ చెబుతూ ట్వీట్స్ చేశారు చిరు, బాబి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి మెగా హీరోలతో నటించిన శ్రుతి.. ఇప్పుడు మరో చిరంజీవితో నటించే చాన్స్ కూడా కొట్టేసింది.