యువ కథానాయకుడు శర్వానంద్‌ను బాగా ఇష్టపడేవాళ్లు కూడా అతను చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో మరిచిపోయారు. ఎప్పుడో 2017లో మహానుభావుడుతో అతను సక్సెస్ రుచి చూశాడు. అంతకుముందు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ అతడికి.. ఆ సినిమా ఊరటనిచ్చింది. కానీ ఆ విజయాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ ఇస్తూ.. మార్కెట్ బాగా దెబ్బ తీసుకున్నాడు.
పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం.. ఇలా గత మూడేళ్లలో వచ్చిన అతడి సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఇందులో జాను, శ్రీకారం చిత్రాలకు టాక్ బాగున్నా కూడా ఆడలేదు. గత ఏడాది వచ్చిన మహాసముద్రం అయితే దారుణాతి దారుణమైన ఫలితాన్నందుకుని శర్వా మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో తన ఆశలన్నీ ఆడవాళ్ళు మీకు జోహార్లు మీదే పెట్టుకున్నాడు శర్వా.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రమైనా తనను గట్టెక్కుస్తుందని శర్వా పెట్టుకున్న నమ్మకం నిలబడలేదు. యావరేజ్ టాక్‌తో మొదలై.. వీకెండ్ వరకు పర్వాలేదనిపించిన ఈ సినిమా.. తర్వాత బాక్సాఫీస్ దగ్గర పడకేసేసింది. వీకెండ్లో వసూళ్లు పర్వాలేదన్న మాటే కానీ.. సినిమాకు జరిగిన బిజినెస్ స్థాయికి తగ్గట్లు లేవు. ఫస్ట్ వీకెండ్లో అటు ఇటుగా ఈ చిత్రం రూ.5 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది.
సోమవారం నుంచి వచ్చే వసూళ్లు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. వీకెండ్ అవ్వగానే జనాలు ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. అందరి దృష్టీ రాధేశ్యామ్ మీదికి మళ్లింది. ఇక శర్వా సినిమా పుంజుకునే అవకాశాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. అతడి ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అనడంలో సందేహం లేదు. అన్ని జానర్లూ ట్రై చేసి చివరికి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తోనూ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న శర్వాను ఇక పైకి లేపే సినిమా ఏదో?