లైంగిక దాడి.. మ‌రోసారి ఓపెన్ అయిన భావ‌న‌

ఐదేళ్లు కావ‌స్తోంది మ‌ల‌యాళ హీరోయిన్ భావ‌న మీద లైంగిక దాడి జ‌రిగి. ఇప్ప‌టికీ ఈ కేసు ఒక కొలిక్కి రాలేదు. మాలీవుడ్లో స్టార్ హీరో అయిన దిలీప్ ఈ దాడి వెనుక సూత్ర‌ధారి అని ఆరోప‌ణ‌లు రావ‌డం, అత‌ను ఈ కేసులో కొన్ని నెల‌ల పాటు జైల్లో ఉండ‌టం.. త‌ర్వాత బెయిల్ మీద బ‌య‌టికి రావడం తెలిసిందే.

ఏవో వ్య‌క్తిగ‌త విష‌యాల్లో గొడ‌వ కార‌ణంగా మ‌నుషుల్ని పెట్టి భావ‌న‌ను కిడ్నాప్ చేయించి ఆమెపై లైంగిక దాడి చేయించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. దీని గురించి మొన్నటిదాకా భావ‌న ఎక్క‌డా నోరు విప్ప‌లేదు. మీడియా కూడా ఈ కేసు విష‌యంలో ఆమె పేరు రాసేది కాదు.

కానీ తాను త‌ప్పు చేయ‌న‌పుడు మౌనం వ‌హించ‌డ‌మేంట‌న్న ఉద్దేశంతో ఇటీవ‌ల భావ‌న ఈ వ్య‌వ‌హారంపై ఓపెన్ అయింది. ఈ కేసు పురోగ‌తి గురించి కేర‌ళ ముఖ్య‌మంత్రి విజ‌య‌న్‌కు బ‌హిరంగ లేఖ కూడా రాసింది.

తాజాగా ఆమె ఈ కేసు విష‌య‌మై ఒక నేష‌న‌ల్ టీవీ ఛానెల్‌తో మాట్లాడింది. త‌న‌ పై జ‌రిగిన లైంగిక దాడి కార‌ణంగా తానెంత మాన‌సిక క్షోభ ఎదుర్కొన్న‌ది ఈ లైవ్ కార్య‌క్ర‌మంలో ఆమె చెప్పుకొచ్చింది. ఆ దాడి ఘ‌ట‌నే త‌న‌ను తీవ్ర మ‌నోవేద‌న‌కు గురి చేస్తే.. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు మ‌రింత వేద‌న మిగిల్చాయ‌ని ఆమె వెల్ల‌డించింది.

ఈ వ్య‌వ‌హారంలో త‌న కోసం చాలామంది నిల‌బ‌డ్డార‌ని.. అదే స‌మ‌యంలో బాధితురాలైన త‌న మీదే ఓ వ‌ర్గం నింద‌లు వేసి, త‌న‌ను సూటి పోటి మాట‌ల‌తో వేధించింద‌ని.. ఆ రోజు తాను ఎందుకు ఆ స‌మ‌యంలో బ‌య‌టికి వెళ్లానంటూ ప్ర‌శ్న‌లు వేశార‌ని.. ఇందులో త‌న‌దే త‌ప్ప‌ని మాట్లాడార‌ని.. ఇవి త‌న‌ను, త‌న కుటుంబాన్ని తీవ్రంగా బాధ పెట్టాయ‌ని భావ‌న వివ‌రించింది.

2019 వ‌ర‌కు తాను సోష‌ల్ మీడియాలో లేన‌ని.. ఆ ఏడాది ఇన్‌స్టాగ్రామ్‌లోకి రాగా.. అక్క‌డ చాలామంది త‌న మీద దాడికి దిగార‌ని.. ఇంకా ఎందుకు బ‌తికున్నావ్, చ‌చ్చిపోవ‌చ్చు క‌దా అంటూ కామెంట్లు చేశార‌ని భావ‌న తెలిపింది. ఇంకా ఇలా మౌనం వ‌హించ‌డం స‌రి కాద‌న్న ఉద్దేశంతోనే ఇటీవ‌ల తాను ఈ విష‌య‌మై ఓపెన్ అయ్యాన‌ని, సీఎంకు లేఖ రాశాన‌ని.. ఈ సంద‌ర్భంగా త‌న‌కు గొప్ప మ‌ద్ద‌తు ల‌భించింద‌ని భావ‌న తెలిపింది.