టాలెంట్ ఉంది.. టేస్టు లేదు

కిర‌ణ్ అబ్బ‌వరం.. రెండేళ్ల కింద‌టే టాలీవుడ్లోకి అడుగు పెట్టిన యువ క‌థానాయ‌కుడు. ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టినా.. తొలి సినిమాతోనే త‌న టాలెంట్ చూపి యువ‌త‌లో మంచి ఫాలోయింగే సంపాదించాడు. అత‌డి తొలి సినిమా రాజావారు రాణివారు థియేట‌ర్ల‌లో అంత‌గా ఆడ‌క‌పోయినా.. ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ తెచ్చుకుని కిర‌ణ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ గుర్తింపుతోనే త‌ర్వాత ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం సినిమా చేశాడు.

ఈ చిత్రానికి అత‌ను క‌థా ర‌చ‌యిత కూడా కావ‌డం విశేషం. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట మంచి బ‌జ్ వ‌చ్చింది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత‌ కాస్త పేరున్న సినిమాల‌ను మించి ఈ చిత్రం ఓపెనింగ్స్ సాధించ‌డం విశేషం. ఈ చిత్రంలోనూ కిర‌ణ్ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. టిపిక‌ల్ రాయ‌ల‌సీమ యాస‌లో అత‌ను చెప్పిన డైలాగ్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. హీరోగా కిర‌ణ్ స్టైల్, మేన‌రిజ‌మ్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. 

ఆ సినిమా చూసిన అంద‌రూ.. ఈ కుర్రాడిలో టాలెంట్ ఉంది.. స‌రైన స‌బ్జెక్టులు ఎంచుకుంటే హీరోగా ఎదుగుతాడు అని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి వీక్ స‌బ్జెక్టుతో సినిమా చేయ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. క‌నీసం త‌ర్వాతి సినిమాతో అయినా త‌ప్పు దిద్దుకుంటాడేమో అనుకుంటే.. సెబాస్టియ‌న్ మూవీ మ‌రీ పేల‌వంగా ఉండి ఈ చిత్రంపై అంచ‌నాలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.

దీంతో పోలిస్తే ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండపం చిత్ర‌మే న‌యం అంటున్నారంతా. కిర‌ణ్‌కు టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ క‌థ‌ల ఎంపిక‌లో, అలాగే మంచి టీంను ఎంచుకోవ‌డంలో అభిరుచి లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారంతా. స‌రైన క‌థ‌, మంచి ద‌ర్శ‌కుడు ప‌డితే కిర‌ణ్ బాగా రాణించ‌గ‌ల‌డ‌ని ఇప్ప‌టిదాకా అత‌ను చేసిన చిత్రాల‌ను చూసి చెప్పేయొచ్చు. మ‌రి ఇక ముందైనా అత‌ను జాగ్ర‌త్త ప‌డ‌తాడా.. మంచి క‌థ‌లు, ద‌ర్శ‌కులు అత‌ణ్ని వెతుక్కుంటూ వ‌చ్చి కెరీర్ గాడిన ప‌డుతుందా అన్న‌ది చూడాలి.