రాజమౌళీ.. ఇది సమంజసమేనా?

ఎవరెన్ని చెప్పినా సినిమాల ప్రభావం జనాల మీద చాలా ఉంటుంది. సినిమాల్లో నటించే వాళ్లు, సినిమాలు తీసేవాళ్లను చూసి కూడా జనాలు ఎంతగానో ఇన్‌స్పైర్ అవుతారు. వాళ్ల మీద అభిమానాన్ని కేవలం సినిమాలకు పరిమితం చేయరు. వ్యక్తిగతంగానూ వారిని అభిమానిస్తారు. అనుసరిస్తారు. ఆరాధిస్తారు. వాళ్లు రాజకీయాల్లో నిలబడితే ఓటు వేస్తారు. ఫలానా వారికి ఓటు వేయమన్నా కూడా వేస్తారు. కాబట్టే సినిమా వాళ్లు ముఖ్యమంత్రులు కాగలిగారు.

సినిమా వాళ్ల మద్దతుతో ముఖ్యమంత్రులు అయిన వాళ్లూ ఉన్నారు. ఇంతగా జనాలను ప్రభావితం చేసేవాళ్లు.. తమ చర్యల పట్ల ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. కానీ రాజమౌళి ఈ విషయాన్ని మరిచిపోయి ఒక సినిమా ముహూర్త కార్యక్రమానికి హాజరవడం ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియాలో. తెలుగువాడైన కర్ణాటక వ్యాపారవేత్త, రాజకీయ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి తన కొడుకు కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా శుక్రవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ వేడుకకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. గాలి జనార్దనరెడ్డితో కలిసి వేదికను పంచుకున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది రాజమౌళి మిత్రుడైన సాయి కొర్రపాటి కావడం వల్లే జక్కన్న ఈ వేడుకకు వచ్చినట్లున్నాడు. కానీ గాలి జనార్దనరెడ్డితో రాజమౌళి చూసి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గాలి అవినీతి చరిత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఆయన తీవ్ర నేరారోపణలు ఎదుర్కొన్నారు.

కేసులు నమోదై జైలు పాలయ్యారు. బెయిల్ కోసం జడ్జికి భారీగా లంచం ఇచ్చినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఆ కేసులు కొనసాగుతున్నాయి. ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఐతే ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా లోక్ సత్తాకు మద్దతు ఇచ్చి, ఆ పార్టీకి ప్రచారం కూడా చేసిన రాజమౌళి.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద అవినీతి పరుల్లో ఒకడిగా పేరున్న గాలి జనార్దనరెడ్డి కుటుంబ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ఆయనతో సన్నిహితంగా కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. రాజమౌళి అనుకుంటే.. దీన్ని అవాయిడ్ చేయగలిగేవాడు కాదా అని ప్రశ్నిస్తున్నారు.