కొత్త సినిమా రిలీజ్ టైంలో టీంలోని కీలక వ్యక్తులు మీడియాలో కనిపించకపోతే రకరకాల అనుమానాలు వచ్చేస్తాయి. టీంలోని ఇతర వ్యక్తులతో అభిప్రాయ భేదాలు.. లేదంటే సినిమాలో తమకు దక్కాల్సిన ప్రాధాన్యం దక్కకపోవడం లాంటి కారణాలతో అలకలు చోటు చేసుకుంటూ ఉంటాయి. టాలీవుడ్ కొత్త రిలీజ్ ‘భీమ్లా నాయక్’ విషయంలోనూ ఇలాంటి విషయాలు చర్చకు వచ్చాయి. దర్శకుడు సాగర్ చంద్రను పక్కకు నెట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరగడంతో త్రివిక్రమ్ కొంత హర్టయ్యాడని, ప్రి రిలీజ్ ఈవెంట్లో అందుకే బ్యాక్ సీట్ తీసుకున్నారని వార్తలొచ్చాయి.
దానికి తర్వాత త్రివిక్రమ్ వివరణ ఇచ్చుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశాడు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భార్యగా కీలక పాత్ర పోషించిన నిత్యా మీనన్.. తన క్యారెక్టర్‌కు తాను కోరుకున్నంత ప్రాధాన్యం దక్కకపోవడంతో హర్టయి ప్రమోషన్లకు దూరంగా ఉన్నట్లుగా గుసగుసలు వినిపించాయి. దీనిపై ఎవరూ ఏమీ స్పందించలేదు. మరోవైపు రానా దగ్గుబాటికి జోడీగా నటించిన సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది.
ఆమె కూడా తన పాత్ర విషయంలో అన్యాయం జరిగిందని ఫీలవుతోందని, షూట్ చేసిన చాలా సన్నివేశాలను ఫైనల్ కట్ సందర్భంగా పక్కన పెట్టేశారని హర్టయిందని మీడియాలో కొంతమేర ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ ప్రచారానికి సంయుక్త వెంటనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను హర్టయ్యానంటూ సోషల్ మీడియాలో కనిపించిన ఒక వార్త లింక్‌కు ఆమె తనదైన శైలిలో జవాబు చెప్పింది.
తాను ‘భీమ్లా నాయక్’ విషయంలో హర్టయిన మాట వాస్తవమని.. అది పాత్ర ప్రాధాన్యం దక్కినందుకు కాదని, ఈ సినిమాను రెండోసారి చూద్దామని ప్రయత్నిస్తే టికెట్లు దొరకనందుకని ఆమె పేర్కొంది. దీంతో ఈ ప్రచారానికి తెరపడిపోయింది. నిజానికి మలయాళంతో పోలిస్తే ఈ పాత్రకు తెలుగులో నిడివి, ప్రాధాన్యం పెంచారు. అదనపు సన్నివేశాలు జోడించారు. చివర్లో ఈ పాత్రతో ముడిపెట్టి ఒక కొత్త ట్విస్టు సినిమాకు మంచి ముగింపునిచ్చింది కూడా. కాబట్టి ఈ క్యారెక్టర్ విషయంలో సంయుక్త హర్టవడానికి ఆస్కారమే లేదు.