యువ కథానాయకుడు నితిన్‌కు కొన్నేళ్లుగా కాలం కలిసి రావట్లేదు. ‘భీష్మ’ మినహాయిస్తే గత ఐదేళ్లలో అతడికి సరైన విజయం లేదు. ఈ చిత్రం కూడా అన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో రిలీజవడం వల్ల టాక్‌కు తగ్గ వసూళ్లేమీ రాబట్టలేదు. దాని తర్వాత చెక్, రంగ్ దె నిరాశ పరిచాయి. ‘మ్యాస్ట్రో’ ఓటీటీలో రిలీజవడం వల్ల అది హిట్టా ఫెయిల్యూరా అని చెప్పలేం. దీని తర్వాత నితిన్ ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు.
ముందు అనుకున్న వేరే చిత్రాలను పక్కన పెట్టి అతను ఎడిటర్ శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణ సగంలో ఉండగా ఈ యంగ్ హీరో మరో కొత్త సినిమాను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎప్పట్నుంచో చర్చల్లో ఉన్న వక్కంతం వంశీ సినిమాను ఎట్టకేలకు నితిన్ ఓకే చేశాడు.
సీనియర్ నిర్మాత ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు ‘జూనియర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తాజా సమాచారం. ఇది ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. తన రచనలో వచ్చిన ‘కిక్’ తరహాలో ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా స్క్రిప్టు రెడీ చేశాడట వంశీ. ‘కిక్’ అనే కాదు.. వంశీ రచయితగా పని చేసిన చాలా సినిమాలు వినోదాత్మకంగానే సాగుతాయి.
కానీ అతను దర్శకుడిగా పరిచయం అయిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ మాత్రం చాలా సీరియస్‌గా నడుస్తుంది. అది పెద్ద డిజాస్టర్ కావడంతో వంశీ దర్శకత్వ ప్రయాణానికి గట్టి దెబ్బ తగిలింది. దీంతో కొన్నేళ్లు లైమ్ లైట్లో లేకుండా పోయాడు. ఎట్టకేలకు నితిన్ అతడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. వంశీ.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఏజెంట్’కు రచన చేసిన సంగతి తెలిసిందే.