ఆ మంత్రి గారే సినిమా తీస్తే పోలా…

కొన్ని కొన్ని విష‌యాలు ఆస‌క్తిగా ఉంటాయి. అదికూడా అధికార పార్టీలో కీల‌కంగా ఉన్న నాయ‌కులు చేసే కామెంట్ల‌కు వాల్యూ ఎక్కువ‌. ఇప్పుడు .. ఈ విష‌యంపైనే చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్‌కు వీర విధేయుడిన‌ని చెప్పుకొనే.. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయ‌ణ‌స్వామి.. త‌ర‌చుగా.. జ‌గ‌న్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయ‌న చేతికి జ‌గ‌న్ ఫ్రేమ్‌తో ఉన్న ఉంగ‌రం కూడా ఒక‌టి ఉంటుంది. అంతేకాదు… జ‌గ‌న్‌ను ఎవ‌రు ఒక్క మాట‌న్నా.. ఆయ‌న వెంట‌నే రియాక్ట్ అవుతారు. కౌంట‌ర్లు కూడా ఇస్తారు.

గ‌తంలో త‌నకు ఉన్న ఎక్సైజ్ శాఖ‌ను తొల‌గించ‌డంపై విప‌క్షాల నుంచివిమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో మంత్రి సూప‌ర్‌గా రియాక్ట్ అయ్యారు. తాము ఎస్సీల‌మ‌ని.. త‌న‌కు జ‌గ‌న్ రాజ‌కీయంగా అవ‌కాశం ఇచ్చార‌ని.. చెప్పుకొ చ్చారు. జ‌గ‌న్‌ను మా సామాజిక వ‌ర్గం పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంద‌ని.. పేర్కొన్నారు. అంటే.. జ‌గ‌న్‌ను ఆయ‌న అత్యంత ప్రేమ‌తో చూసుకుంటున్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు నారాయ‌ణ స్వామి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో భీమ్లా నాయ‌క్ మూవీ విష‌యంలో ర‌గ‌డ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ విధించ‌డం వ‌ల్ల‌.. ప‌వ‌న్ ను రాజకీయంగా వేధింపుల‌కు గురి చేస్తోంద‌ని.. కొంద‌రు వ్యాఖ్యానించారు. ఇది ప‌వ‌న్‌కు డ్యామేజీ చేయాల‌ని చూస్తున్న ప‌రిణామంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన నారాయ‌ణ స్వామి.. అన్ని సినిమా ల‌కు అనుస‌రించిన విధానాన్నే తాము భీమ్లా విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రించామ‌న్నారు. అయినా.. లాభ న‌ష్టాల‌తో హీరోల‌కు పనేం ఉంటుంద‌న్నారు.

అంతేకాదు.. ఎంత పెద్ద హీరో న‌టించినా.. వంద రోజులకు మించి సినిమా ఆడే ప‌రిస్థితి లేద‌ని.. నారాయ ణ స్వామి చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌.. సీఎం జ‌గ‌న్ ను పెట్టి సినిమా తీస్తే.. వెయ్యిరోజులు ప‌క్కా గా సినిమా ఆడుతుంద‌ని.. అన్నారు. జ‌గ‌న్ మాస్ జ‌నాల రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించారు. పేద‌ల హీరోగా అభివ‌ర్ణించారు. అయితే.. మంత్రి వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీ నేత‌లే.. “అయితే.. మీరే ఆయ‌న‌తో సినిమా తీయొచ్చుగా సార్‌“ అని చ‌లోక్తులు విస‌ర‌డం ఆస‌క్తిగా మారింది.