ఈ గురువారం తమిళంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది అక్కడి టాప్ స్టార్ అజిత్ సినిమా ‘వలిమై’. తెలుులో కూడా ఈ చిత్రాన్ని తొలి రోజు వరకు భారీగానే రిలీజ్ చేశారు. ఐతే తెలుగులో ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. పైగా శుక్రవారం ‘భీమ్లా నాయక్’ రిలీజవడంతో దీన్ని పట్టించుకునే వారు లేకపోయారు.
కానీ తమిళనాట మాత్రం ‘వలిమై’ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్కడి ప్రేక్షకుల నుంచి సినిమా పట్ల సానుకూల స్పందనే వస్తోంది. రివ్యూలన్నీ కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రధానంగా యాక్షన్ ఘట్టాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
అలాగే విలన్ పాత్ర, నేపథ్యం కొత్తగా ఉందని అంటున్నారు. అంతకుమించి సినిమాలో పెద్దగా విషయం ఏమీ లేదు. ఐతే దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమా కాన్సెప్ట్‌ను జాకీ చాన్ నటించిన హాంకాంగ్ మూవీ నుంచి ఎత్తుకొచ్చేశాడనే ఆరోపణలు వస్తున్నాయిప్పుడు.
ది న్యూ పోలీస్ స్టోరీ.. 2004లో విడుదలైన జాకీ చాన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని స్వయంగా జాకీ చానే ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. అది చూస్తే ‘వలిమై’కి అది స్ఫూర్తిగా నిలిచిందనే విషయం ఈజీగా అర్థమైపోతుంది. ముఖాలకు మాస్కులు వేసుకుని.. బైకుల మీద తిరుగుతూ దారుణాలకు పాల్పడే విలన్ బ్యాచ్‌ను ఇందులో చూడొచ్చు. అందులోనూ హీరో పోలీసే.
తన టీంతో కలిసి ఈ బైక్ బ్యాచ్ మీద ఎటాక్ చేయడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఆ సన్నివేశాలు ‘వలిమై’కు దగ్గరగా ఉన్నాయి. ఇక వలిమై పతాక సన్నివేశాల్లో హీరో కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో పైన వేలాడదీసే సన్నివేశముంటుంది. అది జాకీ చాన్ సినిమా ట్రైలర్లోనూ ఉంది. రేసింగ్ బైకులతో విన్యాసాలు చేసే సన్నివేశాలు కూడా దగ్గరగా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తే వినోద్.. ‘న్యూ పోలీస్ స్టోరీ’ సినిమా చూసి బాగానే ఇన్స్పైర్ అయి ‘వలిమై’ తీశాడని అర్థమైపోతుంది.