టికెట్ల రేట్లు సహా ఇండస్ట్రీ సమస్యల గురించి మాట్లాడటానికి ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రతినిధుల బృందం అమరావతికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలిసిన సంగతి తెలిసిందే. తర్వాత ఓ సందర్భంలో ఈ మీటింగ్ గురించి ప్రస్తావిస్తూ.. మిమ్మల్ని ఆహ్వానించారా అని నందమూరి బాలకృష్ణను అడిగితే.. తనను పిలిచారని, కానీ వెళ్లలేదని చెప్పారు.
తాను ఏపీ సీఎంను కలవనని తెగేసి చెప్పారు కూడా. అఖండ సినిమా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిందని, కాబట్టి ఏపీలో టికెట్ల రేట్లు తన సినిమాకు సరిపోయాయని.. రేట్ల పెంపు అవసరం కూడా లేదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఇది చూసి బాలయ్య రూటే వేరని.. ఆయన ఎవరి ముందూ తలవంచరని సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇచ్చారు ఆయన అభిమానులు, టీడీపీ సపోర్టర్స్.
కానీ ఇప్పుడు ఏపీ మంత్రి పేర్ని నాని చెప్పిన మాటలు విని విస్తుపోతున్నారు అందరూ. ‘అఖండ’ విడుదలకు ముందు బాలయ్య ఏపీ సీఎం అపాయింట్మెంట్ అడిగినట్లు నాని వెల్లడించడం గమనార్హం. నూజివీడు ఎమ్మెల్యే ద్వారా అఖండ నిర్మాతలు తనను కలిసే ప్రయత్నం చేశారని.. వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వగా.. బాలయ్యతో ఫోన్లో మాట్లాడించారని నాని తెలిపారు.
ఆ సందర్భంగా బాలయ్య సీఎం అపాయింట్మెంట్ కోరారని.. తర్వాత జగన్కు తాను ఈ విషయం చెప్పానని నాని అన్నారు. అపాయింట్మెంట్ ఎందుకని సీఎం అడిగితే.. అఖండ సినిమా టికెట్ల రేట్ల గురించి అయ్యుండొచ్చని తాను చెప్పగా.. బాలయ్య వచ్చి తనను కలిస్తే ఆయన ఇమేజ్ దెబ్బ తింటుందని, ఆయనకు ఏం కావాలో అడిగి చేసేయాలని తనకు సీఎం సూచించారని వెల్లడించారు నాని. ఇది నిజం కాదేమో బాలయ్యను, అఖండ నిర్మాతలను అడగాలని.. తాము అఖండ సినిమాను ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టామో చెప్పమనండని విలేకరులు వ్యాఖ్యానించారు నాని.
Gulte Telugu Telugu Political and Movie News Updates