ఆదిపురుష్.. అలా మొద‌లైంది

రామాయ‌ణం మీద ఇప్ప‌టికే ఇండియ‌న్ స్క్రీన్ మీద చాలా సినిమాలొచ్చాయి. అయినా ఆ పురాణ గాథ మీద సినిమాలేమీ ఆగిపోలేదు. ఇప్ప‌టిదాకా వ‌చ్చిన అన్ని సినిమాల‌నూ త‌ల‌ద‌న్నేలా మ‌న ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఆదిపురుష్ పేరుతో రామాయ‌ణ గాథ‌ను కొత్త కోణంలో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ న‌డుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఓం రౌత్ ఒక ఇంట‌ర్వ్యూలో ఈ సినిమా గురించి ఆస‌క్తిక‌ర విశేషాలు పంచుకున్నాడు.

అస‌లీ సినిమా ఎలా మొద‌లైందో అత‌ను వివ‌రించాడు. జప‌నీస్ డైరెక్ట‌ర్ యుగో సాకో.. రామాయ‌ణం స్ఫూర్తితో తీసిన ఓ సినిమా చూస్తుండ‌గా.. ఒక విదేశీయుడు మ‌న పురాణ గాథ మీద ఇంత ఆస‌క్తిక‌ర చిత్రం తీసిన‌పుడు, మ‌నం అలాంటి ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌కూడ‌దు అన్న ఆలోచ‌న‌తో తాను.. రామాయ‌ణానికి కొత్త వెర్ష‌న్ రాయ‌డం మొదలు పెట్టిన‌ట్లు రౌత్ వెల్ల‌డించాడు.

ఈ క‌థ రాస్తున్న‌పుడు రాముడిగా ప్ర‌భాస్ త‌ప్ప వేరొక‌రిని తాను ఊహించుకోలేదని.. స్క్రిప్టు పూర్త‌య్యాక ప్ర‌భాస్‌కు ఫోన్లో క‌థ చెప్ప‌డం మొదలుపెట్టాన‌ని.. మూడు సీన్లు చెప్ప‌గానే, నేరుగా వ‌చ్చి క‌లిసి క‌థ వింటాన‌ని చెప్పాడ‌ని రౌత్ తెలిపాడు. క‌థ విన్న వెంట‌నే సినిమాకు ఓకే చెప్పాడ‌ని.. అత‌డిలా ఈ సినిమాను త‌న భుజ‌స్కందాల‌పై ఇంకెవ్వ‌రూ మోయ‌లేర‌ని కితాబిచ్చాడు రౌత్.

ఈ సినిమా బ‌డ్జెట్ రూ.400 కోట్ల‌ని వెల్ల‌డించిన రౌత్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తామ‌ని.. బేసిగ్గా హిందీ, తెలుగు భాష‌ల్లో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని.. త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ స‌హా ప‌లు భాష‌ల్లో అనువాదం చేస్తున్నామ‌ని.. ఇప్ప‌టిదాకా ఏ ఇండియన్ సినిమాకూ లేని స్థాయిలో భారీగా ఈ చిత్రం విడుద‌ల‌వుతుంద‌ని రౌత్ తెలిపాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ పేరు రామ్ కాద‌ని.. రాఘ‌వ్ అని, అది రాముడికున్న మరో పేరు కావ‌డంతో అలా పెట్టామ‌ని రౌత్ వెల్ల‌డించాడు.