ఇండస్ట్రీ పెద్దలకు, బుక్ మై షోకు మధ్య గొడవ ఎందుకొచ్చిందో.. దీనికి పరిష్కారం ఏంటో కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్‌కు నైజాం ఏరియాలో బుక్ మై షోలో టికెట్ల అమ్మకం లేకపోవడంతో ప్రేక్షకుల జేబులకు భారీగానే చిల్లుపడేలా కనిపిస్తోంది. ఒక్కో టికెట్ మీద బుక్ మై షో వసూలు చేసే కన్వేయన్స్ ఫీజు ఎక్కువ ఉంటోందని.. ఇటీవల టికెట్ల రేట్ల పెంపుతో బుక్ మై షోకు లాభం పెరిగిందని.. అందులో కొంత పర్సంటేజ్ నిర్మాతలకు ఇవ్వాలని దిల్ రాజు సహా టాప్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బుక్ మై షోను డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
తమ డిమాండుకు తలొగ్గకపోవడంతో భీమ్లా నాయక్ బుకింగ్స్ బుక్ మై షోకు ఇవ్వకుండా ఆపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా టికెట్లను థియేటర్ల దగ్గరే అమ్మాలని నిర్ణయించారు. అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
బుక్ మై షోతో గొడవ సద్దుమణుగుతుందని.. భీమ్లా నాయక్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని చూస్తున్న ప్రేక్షకులకు నిరాశ తప్పట్లేదు.
ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ ఉండగా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. థియేటర్ల దగ్గరికెళ్తేనేమో తొలి రోజుకు అన్ని షోలూ సోల్డ్ ఔట్ అంటున్నారు. టికెట్ల అమ్మకాలు ఎప్పుడు మొదలయ్యాయో ఎప్పుడు పూర్తయ్యాయో తెలియదు. ఆన్ లైన్ టికెటింగ్ లేని రోజుల్లో అయితే థియేటర్ల దగ్గర బుకింగ్స్ ఎప్పుడు ఏంటనే విషయంలో ఒక క్లారిటీ ఉండేది. అది అలవాటుగా జరిగే వ్యవహారం కాబట్టి ప్రేక్షకులూ ఒక స్పష్టతతో ఉండేవారు.
ఇప్పుడేమో థియేటర్ల దగ్గర టికెట్లు సంపాదించే పరిస్థితి కనిపించడం లేదు. టికెట్లన్నీ థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ చేసి పెట్టి.. రిలీజ్ రోజు అసలు ధర మీద రెండు మూడు రెట్లకు బ్లాక్‌లో అమ్మేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ సినిమా అంటే ఉండే క్రేజ్ అలాంటిది మరి. మొత్తానికి బుక్ మై షోతో ఇండస్ట్రీ జనాల గొడవ ప్రేక్షకులకు భారంగా మారేలా కనిపిస్తోంది